15 ఏళ్లుగా మట్టి వినాయకుడికి పూజలు
భిక్కనూర్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ భిక్కనూర్లోని చైతన్య విద్యానికేతన్ హైస్కూల్(Chaitanya Vidyaniketan High School)లో గత 15 ఏళ్లుగా మట్టి వినాయకుడిని(Clay Vinayaka) ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. సోషల్ ఉపాధ్యాయుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గణేష్ చతుర్థికి రెండు రోజుల ముందుగానే పొలం గట్ల నుంచి మట్టిని సేకరించి, నానబెట్టి స్వయంగా వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
అనంతరం పాఠశాలలో 11 రోజుల పాటు ప్రతిరోజూ ఒక్కో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వినాయక చవితి ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని పాఠశాల కరెస్పాండెంట్ భూర్ల రేణుకుమార్, హెడ్మాస్టర్ అశోక్ యాదవ్ తెలిపారు.