అటెండెన్స్ రిజిస్టర్‌లో ఫోర్జరీ ఆరోపణలు..

06-11-2026 | 05:09pm

ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్

రెండేళ్లుగా కొనసాగిన విచారణ.. ఐదుగురు అధికారుల పరిశీలనతో చర్యలు

ఇల్లెందు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఇల్లెందు మండలం మర్రిగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి. రమేష్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి శంభుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో కల్పిత నమోదు, ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయుడిపై గత రెండేళ్లుగా పలు ఆరోపణలు రావడంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

అర్హతలేని సెలవులకు సైతం పూర్తి వేతనం చెల్లించాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడం, పాఠశాలకు గైర్హాజరు కావడం, పాఠశాల అభివృద్ధి పేరుతో గ్రామస్థుల సంతకాలు సేకరించి మోసానికి పాల్పడటం, పాఠశాల రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. సుమారు ఐదుగురు అధికారులు వివిధ దశల్లో విచారణ జరిపినట్లు సమాచారం. అయితే క్రమశిక్షణ చర్యల విషయంలో జాప్యం జరగడంపై ఉపాధ్యాయ వర్గాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఒత్తిళ్ల కారణంగానే చర్యలు ఆలస్యమయ్యాయనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి విచారణ చేపట్టిన జిల్లా అధికారులు, ఆరోపణలపై పరిశీలన అనంతరం ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు