ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం
మండల అధ్యక్షుడిగా పాబోలు మణికిరణ్.. పట్టణ అధ్యక్షుడిగా నరేంద్రుల అను బాబు
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు ఆర్యవైశ్య మహాసభ(Illendu Arya Vysya Mahasabha) మండల, పట్టణ నూతన అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ నెల 3న పట్టణంలోని 18వ వార్డు కళాసిబస్తీలోని ఆర్యవైశ్య సత్రంలో సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి యెలుగూరి నగేష్‌కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రెండు పదవులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో పాబోలు మణికిరణ్ మండల అధ్యక్షుడిగా,
నరేంద్రుల అను బాబు పట్టణ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ధారా రమేష్ నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఆర్యవైశ్య సమాజ అభివృద్ధి, ఐక్యతకు కృషి చేస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. సమాజ సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.
నూతన అధ్యక్షులు పాబోలు మణికిరణ్, నరేంద్రుల అను బాబు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకొని సమాజ అభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు గౌరిశెట్టి కృష్ణ, భాను ప్రకాష్, జిల్లా నాయకుడు ధారా ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.