జర్నలిస్టులపై అక్రమ కేసులు సరికాదు

10-10-2026 | 09:38pm

- నిజ నిర్ధారణ లేకుండా కేసులు ఎలా..?

- జర్నలిస్టులపై అక్రమ కేసులను ప్రతిఘటిస్తాం.

- టిడబ్ల్యూజెఎఫ్,టియుడబ్ల్యూజె నాయకులు

అశ్వాపురం, అక్టోబర్ 10(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో జర్నలిస్టులపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో,పోలీసుల తీరుపై జర్నలిస్టు సంఘాల నాయకులు టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెలమ రాజేందర్,పినపాక నియోజకవర్గ తెలంగాణా యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజెయు)ఉపాధ్యక్షుడు రెడ్డి మహేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అశ్వాపురం మండల కేంద్రంలో శనివారం వారు మాట్లాడుతూ... జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించేలా,వారిని ఇబ్బందులకు గురిచేసేలా కేసులు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఇటీవల జర్నలిస్టులపై నిజా నిజాలు పరిశీలించకుండా పెడుతున్న అక్రమ కేసుల గురించి వారు ఆవేదన వ్యక్తం చేశారు.సమ సమాజ నిర్మాణం కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం,ప్రజలతో ప్రజాప్రతినిధులతో మమేకమై పనిచేస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటని వారు పేర్కొన్నారు.ఇటీవల జరిగిన ఒకే ఘటనకు సంబంధించి వేర్వేరు తేదీల్లో ఫిర్యాదులు రావడం,ఫిర్యాదు చేసిన సుమారు 40 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం వంటి అంశాలపై నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు.

ఫిర్యాదు ఆలస్యానికి గల కారణాలను పరిశీలించకుండా కేసులు ఎలా నమోదు చేస్తున్నారో పోలీసులు స్పష్టత ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులపై వరుసగా కేసులు నమోదవుతుండటానికి రాజకీయ ఒత్తిళ్లు కారణమవుతున్నాయా అనే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత పోలీసుల వైఖరి అర్థం కావట్లేదని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, వార్తా సేకరణలో భాగంగా పనిచేసే జర్నలిస్టులపై కేసులు నమోదైనప్పుడు వాటి వెనుక ఉన్న వాస్తవాలను నిష్పక్షపాతంగా పరిశీలించాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై నమోదవుతున్నట్లు వారు పేర్కొన్నారు. జర్నలిస్టులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని,జర్నలిస్టులపై నిజా నిజాలు పరిశీలించకుండా పెట్టే ఇటువంటి అక్రమ కేసులు సరికావని,అధికారులు నిజా నిజాలు పరిశీలించాలని లేనిపక్షంలో ఇటువంటి చర్యలను వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు