అవుషాపూర్ విల్లాస్‌లో భారీ చోరీ
ఘట్కేసర్, నవంబర్ 24 (విజయక్రాంతి): ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుషాపూర్ జగత్ స్వప్న విల్లాస్‌లో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి దొంగలు ఐదు ఇళ్లలో చోరీకి ప్రయత్నించగా.. ఓ విల్లాలో భారీగా బంగారం, వెండి, నగదును అపహరించారు. ఫెన్సింగ్ వైరింగ్‌ను కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విల్లా నంబర్ 18లో నివాసం ఉంటున్న దివ్యకోలు విజయలక్ష్మి ఈ నెల 9న తన మామ మరణించడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు.
సోమవారం ఉదయం 10 గంటల సమయంలో విల్లా సెక్యూరిటీ గార్డు తనిఖీలు నిర్వహిస్తుండగా.. విల్లా నంబర్ 18 తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించాడు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వెంటనే ఫోన్ ద్వారా యజమానికి సమాచారం అందించాడు. దీంతో విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో భద్రపరిచిన సుమారు 40 తులాల బంగారం (Gold), 2 కిలోల వెండి (Silver), రూ.1.75 లక్షల నగదు (Cash) కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.
అదేవిధంగా విల్లా నంబర్లు 49, 41, 43, 56లోనూ దొంగలు చోరీకి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకుని తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ఘట్కేసర్ పోలీసులు (Police) సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మిగతా నాలుగు ఇళ్లలో ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీలోనే భారీ చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు