టెంట్ వేస్తుండగా విద్యుత్ షాక్.. అయ్యప్ప స్వామి మృతి

24-11-2026 | 04:10pm

కొండపాక, నవంబర్ 24 (విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించిన నాగరాజు (25) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. ఇంటి ముందు టెంట్ (Tent) ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు గ్రామానికి చెందిన నాగరాజు తన అన్న చెరుకు కనకరాజు వద్ద ఉంటూ అయ్యప్ప దీక్ష (Deeksha) కొనసాగిస్తున్నాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతంతో పాటు అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇంటి ముందు టెంట్ వేస్తుండగా.. ఇనుప పైపులు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలాయి. దీంతో నాగరాజు విద్యుత్ షాక్ (Electric Shock)కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తొలిసారిగా అయ్యప్ప మాల ధరించి శబరిమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని ఆశించిన నాగరాజు అకాల మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతడితో పాటు దీక్ష చేస్తున్న అయ్యప్ప స్వాములు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో దుద్దెడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు