రేగా.. పద్ధతి మార్చుకోండి!

16-10-2026 | 11:45am

అశ్వాపురం,(విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన వైఖరిని మార్చుకోవాలని, అధికారులు, ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన రేగా సంస్కారహీనంగా మాట్లాడటం తగదని విమర్శించారు.

గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూర్గంపాడు నుంచి కొత్తగూడెం వరకు ఇసుక దందాలు సాగించారని రేగా కాంతారావుపై ఆరోపణలు చేశారు. పినపాక నియోజకవర్గంలో వందలాది ఎకరాల అటవీ భూములు, పేదల భూములు అన్యాక్రాంతమయ్యాయని పేర్కొన్నారు. మణుగూరులో పేదల ఇంటి స్థలాల ఆక్రమణలపై గతంలో బాధితులు మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఎస్‌ఐ కుటుంబం నుంచి చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేస్తే, దానికి అక్రమాల రంగు పులమడం ఎంతవరకు సమంజసమని కొమటిరెడ్డి ప్రశ్నించారు. ఆ భూమి అక్రమమైనదైతే, విక్రయించిన వారే సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని రేగా కాంతారావును హెచ్చరించారు.

మరిన్ని వార్తలు