పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

13-11-2026 | 05:03pm

బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

కొత్తగూడెం నవంబర్ 13 విజయక్రాంతి : హేమచంద్రపురంలోని(Hemachandrapuram) జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్(District SP Rohit Raju, IPS) గురువారం  వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల(District Armed Reserve Police) నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించారు.

అనంతరం అడ్మిన్ ఆర్ఐ, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, వెల్ఫేర్, హోంగార్డ్స్ కార్యాలయాలను(Home Guards offices) సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాల పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలని, అవసరమైన శిక్షణను పొందుతూ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక దృఢత్వాన్ని కాపాడుకోవాలని, ప్రతిరోజూ వ్యాయామం, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.  అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్, ఆర్ఐ ఎంటీఓ సుధాకర్, ఆర్ఐ హోంగార్డ్స్ నరసింహారావు, ఆర్ఐ అడ్మిన్ లాల్ బాబు, ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు