పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

13-11-2026 | 06:05pm

మండలానికి కొత్తగా 458 పింఛన్లు మంజూరు

ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ హమీద్

గంభీరావుపేట, నవంబర్ 13 (విజయక్రాంతి): పేదల సంక్షేమం(Welfare of the poor), రాష్ట్ర సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహమ్మద్ హమీద్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల('Cheyutha' pensions) మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ.. గంభీరావుపేట మండలానికి కొత్తగా 458 పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19 నుంచి జిల్లాలో కొత్తగా మంజూరైన పింఛన్ల నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోందన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తోందని వివరించారు. రైతులకు రూ.20,650 కోట్ల రుణమాఫీ ద్వారా 25.20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అర్హులైన పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతీరెడ్డి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ-నర్సాగౌడ్,సింగిల్ విండో చైర్మన్ వేశాల వెంకటి, రాష్ట్ర నాయకులు పర్స హన్మండ్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు