ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా భద్రత పథకం
జగిత్యాల, నవంబర్ 13 ( విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Telangana Indiramma Life Insurance Scheme) పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు.
కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా తెలంగాణలోని ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు జీవిత బీమా పథకాలు కొన్ని నిర్దిష్ట వర్గాలకే పరిమితమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వ దార్శనికత మాత్రం ప్రతి కుటుంబం భద్రతతో జీవించాలనే లక్ష్యంతో ఉందన్నారు. నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారని, అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పథకం ప్రారంభమవుతుందని తెలిపారు.
నవంబర్ 14 నుంచి విస్తృత ప్రచారం చేపట్టాలి...
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశ అభివృద్ధికి బాటలు వేసిన నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఈ పథకం సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ద్వారా అన్ని కుటుంబాల వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నవంబర్ 19న ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. కుటుంబ పెద్ద సూచించిన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవచ్చని, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ప్రతిపాదించే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి...
ఈ పథకం అమలును దేశమంతా నిశితంగా గమనిస్తోందని, ప్రతి జిల్లా కలెక్టర్ బాధ్యతతో వ్యవహరించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పథకాన్ని విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా పథకం అమలు తీరును పర్యవేక్షిస్తారని తెలిపారు.
పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు, సిబ్బంది చురుగ్గా పనిచేస్తూ గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల వారీగా అవసరమైన నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికి ఈ పథకంపై సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. నవంబర్ 18న ప్రతి గ్రామంలో టాంటాం ద్వారా ప్రచారం నిర్వహించి, పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, దరఖాస్తుల స్వీకరణ వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎలాంటి కుటుంబం ఈ పథకం గురించి తెలియక లబ్ధి పొందకుండా ఉండిపోకూడదని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పథకం చేరేలా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను కచ్చితత్వంతో సేకరించాలని, దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు.
కుటుంబంలోని సంపాదన సభ్యుడికి జీవిత బీమా కల్పించే విధంగా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులైన వ్యక్తుల వివరాలను సేకరించాలని తెలిపారు. వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలతో పాటు బీమా పొందే వ్యక్తి పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ నంబర్లు సేకరించాలని తెలిపారు.
దరఖాస్తులో జిల్లా, మండలం, గ్రామం లేదా పట్టణ వార్డు వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. నామినీ వివరాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలని, ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను ప్రతిపాదించిన సందర్భంలో ప్రతి ఒక్కరి వాటా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. నామినీ మైనర్ అయిన పక్షంలో అతని తరఫున నియమించిన గార్డియన్ లేదా ప్రతినిధి వివరాలను కూడా నమోదు చేయాలన్నారు.
ప్రతి దరఖాస్తులో అవసరమైన వివరాలు పూర్తిగా ఉండాలని, దరఖాస్తుదారుడి సంతకంతో పాటు సంబంధిత ధ్రువీకరణ అధికారి సంతకం కూడా ఉండేలా చూడాలన్నారు. వివరాల నమోదు, నామినీ వివరాల సేకరణలో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
సంతకం చేసిన దరఖాస్తులను స్కాన్ చేసి డిజిటల్ విధానంలో బీమా సంస్థకు పంపించాలని సీఎస్ సూచించారు. అసలు దరఖాస్తులను జిల్లా స్థాయిలో భద్రపరచాలని, భవిష్యత్తులో అవసరమైన పరిశీలన, ధ్రువీకరణ, క్లెయిమ్‌ల పరిష్కారానికి వీలుగా రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలన్నారు.
వచ్చే 15 నుంచి 20 రోజుల పాటు యుద్ధప్రాతిపదికన ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు, నామినీ వివరాలు సేకరించాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు డిజిటల్ వ్యవస్థలో సక్రమంగా నమోదయ్యేలా చూడాలని, ఏ ఒక్క కుటుంబం కూడా నమోదు ప్రక్రియలో మిగిలిపోకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.
బీమా పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం అందించే ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, సీపీఓ/డీఆర్డీఓ, జిల్లా కలెక్టర్ లేదా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సమన్వయంతో క్లెయిమ్‌ల పరిశీలన, ధ్రువీకరణ చేపట్టి బీమా సంస్థ ద్వారా నామినీకి పరిహారం అందేలా చూడాలన్నారు.
మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీపీఓ/మెప్మా సంబంధిత అధికారులు సమన్వయంతో క్లెయిమ్‌ల ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు అధికారులు, డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి క్లెయిమ్‌ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో సీపీఓ, డీఆర్డీఓ, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్లెయిమ్‌లకు సంబంధించిన వివరాలు, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కార పురోగతిని జిల్లా స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.