అసలైన భూ నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదు
- భూ సేకరణ అక్రమాలపై జిల్లా అధికారులు విచారణ చేపట్టాలి
- రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి
- అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ డిమాండ్
మణుగూరు, నవంబర్ 27(విజయ క్రాంతి ):సింగరేణి మణుగూరు ఓసీ విస్తరణ భూ సేకరణలో(Land acquisition for OC expansion) అసలైన భూ నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ హెచ్చరించారు. సంబంధం లేని వ్యక్తులు సాగుదారులమంటూ కొందరు మధ్యవర్తుల సహకారంతో భూ నిర్వాసితుల జాబితాలో చేరారని ఆరోపించారు.
ఒకటి, రెండు గుంటల భూముల పేరుతో నకిలీ లబ్ధిదారులను చేర్చి కోట్ల రూపాయల సింగరేణి నిధులు దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ అక్రమాలపై జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అసలైన రైతులకు న్యాయం చేయడంతో పాటు అక్రమంగా జాబితాలో చేరిన వారి పేర్లను తొలగించాలని కోరారు. లేనిపక్షంలో అభివృద్ధిని ఆకాంక్షించే సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే ఎంపీ బలరాం నాయక్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు ఎండీ షబానా, కోరి శ్యామల, కన్నాపురం వసంత తదితరులు పాల్గొన్నారు.