ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్(విజయక్రాంతి):జిల్లాలో జాతీయ ఆహార భద్రత(National Food Security) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి ఆహార భద్రత చట్టం అమలుపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత బలహీనవర్గాల వారికి ఆహార భద్రతా కార్డు ఒక వరమని తెలిపారు. ప్రతి పేదవారికి ఆహార భద్రతను కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు విజిలెన్స్ కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
ఆహార భద్రత కార్డులకు పంపిణీ చేస్తున్న బియ్యం సన్న రకం నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకులాలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నిర్ణీత గడువులోగా అందించాలని తెలిపారు.
రాయితీ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, డివిజన్, మండల స్థాయిలో జాతీయ ఆహార భద్రత చట్టంపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించి, తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.