విధుల నిర్లక్ష్యంపై జిల్లా వైద్యాధికారిణి ఆగ్రహం..
- ఉదయం మెమో...సాయంత్రం ప్రశంసాపత్రం!
- ఉత్తమ సేవలకు కలెక్టర్ అభినందన
మోతె, నవంబర్ 27 (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా మోతె మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre) వైద్యాధికారిణి డాక్టర్ భవాని(Dr. Bhavani) విషయంలో ఒకే రోజు రెండు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఉదయం విధుల పట్ల నిర్లక్ష్యం వహించారంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కోటి రత్నం ఆమెకు మెమో జారీ చేయగా...
సాయంత్రం గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రశంసాపత్రం అందజేశారు.ఈ సమయంలో వైద్యాధికారిణి కూడా కలెక్టర్ పక్కనే ఉండి ప్రశంసా పత్రం అందజేయడంలో ఆమె కూడా భాగస్వామి కావడం జిల్లా అధికారులను,వైద్య ఆరోగ్య సిబ్బందిని,ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది.
మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల విధుల నిర్వహణపై గురువారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి కోటి రత్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.విధుల పట్ల అలసత్వం వహించిన డాక్టర్ భవానికి మెమో జారీ చేశారు.వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని,విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇంత వరకు బాగానే ఉన్నా..మరోవైపు,ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ సురక్షిత ప్రసవాలు నిర్వహిస్తున్నందుకు డాక్టర్ భవానిని జిల్లా కలెక్టర్ అభినందించారు.గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ప్రశంసాపత్రం కూడా అందజేశారు.ఆరోగ్య కేంద్ర స్థాయిలోనే గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడం,
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో ఆమె చూపుతున్న చొరవను అధికారులు కొనియాడారు.కాగా ఒకే రోజు ఉదయం విధుల నిర్లక్ష్యంపై మెమో..సాయంత్రం ఉత్తమ సేవలకు భవానికి ప్రశంసాపత్రం అందజేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.