మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
అసిఫాబాద్ ( విజయక్రాంతి): జిల్లాను మాదకద్రవ్య రహిత(Drug-free) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత (Collector K. Haritha) అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల పాలనాధికారి చాంబర్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సొసైటీ ప్రతినిధులతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని తెలిపారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు ఆరోగ్యంగా, ఆర్థికంగా క్షీణించి వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, యువత మత్తు బారిన పడకుండా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మత్తు పదార్ధాలు, మద్యం, పొగాకు వంటి వాటికీ యువత దూరంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు