లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం

04-11-2026 | 09:32pm
  1. నిలిచిన నీటిని తక్షణం మళ్లించాలి.
  2. డ్రైన్లలో పూడికతీత పనులు వేగవంతం చేయాలి.
  3. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి
  4. సహాయక చర్యల్లో యంత్రాంగం నిమగ్నం కావాలి.
  5. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం చేపట్టాలి.
  6. కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్.

కొత్తగూడెం : టౌన్ నవంబర్ 4 (విజయకాంతి): లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య(Flooding problem) తలెత్తకుండా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెం నగర మేయర్ మూడ్ గణేష్(Mayor Mood Ganesh) ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం పాల్వంచలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు.

పాల్వంచ పరిధిలోని 8, 42 డివిజన్లలో నిలిచిన వరద నీటిని డ్రైన్ల వైపు మళ్లించే పనులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రధాన, అంతర్గత రహదారులపై నిలిచే మోకాళ్ళలోతు నీటిని సమీప మురుగు కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. వరద నీరు వెనక్కి తన్నకుండా, ఆవాసాల్లోకి చేరకుండా అదనపు మోటార్లతో నీటిని తోడివేయాలని పారిశుధ్య విభాగాన్ని ఆదేశించారు. డ్రైన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను జేసీబీలతో తక్షణమే తొలగించి పూడికతీత పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

వాతావరణం సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు క్షేత్రస్థాయిని విడిచి వెళ్లరాదని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల వేళ విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, దోమల మందు పిచికారీ పనులు నిరంతరం కొనసాగించాలన్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌ను సమన్వయం చేసుకుంటూ, తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

వర్షాల వల్ల ఇబ్బందులు పడే నగరవాసులకు ప్రతి డివిజన్‌లోనూ సత్వర సహాయం అందించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విజయానంద్, డిప్యూటీ మేయర్ లలిత, కార్పొరేటర్ జివిఆర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు