2047 నాటికి భారత్ అగ్రస్థానంలో నిలవాలి
- దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిపేందుకు యువత తమ ఆలోచనలు, నూతన ఆవిష్కరణలతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి(BJP State Vice President Raghunath Verabelli) పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ – 2047 లక్ష్యంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన యువ కాంక్లేవ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనే అంశంపై విద్యార్థులతో చర్చించారు. విద్య, ఉపాధి, పరిశ్రమల స్థాపన, వ్యవసాయ రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై యువత తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశ అభివృద్ధికి యువత ఆలోచనలు, సూచనలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అమీరిశెట్టి రాజ్‌కుమార్, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, ఆకుల అశోక్‌వర్ధన్, సత్యనారాయణ, కమలాకర్‌రావు, రాకేష్ రెన్వ, బింగి ప్రవీణ్, తరుణ్‌సింగ్, కళాశాల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు.