4,130 మీటర్ల ఎత్తులో జాతీయ జెండా, జై భీమ్, పంచశీల పతాకాల ఆవిష్కరణ

04-11-2026 | 10:28pm

అన్నపూర్ణ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఓబులాపూర్ న్యాయవాది ఎర్ర రమేష్

మల్లాపూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): నేపాల్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో 4,130 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంప్‌ను మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది ఎర్ర రమేష్(Lawyer Erra Ramesh) విజయవంతంగా అధిరోహించారు.

అత్యంత క్లిష్టమైన పర్వత మార్గాలు, ఎముకలు కొరికే చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి ఆయన ఈ సాహస యాత్రను పూర్తి చేశారు.జీను నుంచి ప్రారంభమైన ఈ ట్రెక్కింగ్‌లో చోమ్రాంగ్, లోయర్ సినువా, అప్పర్ సినువా, బాంబూ, దోవాన్, హిమాలయ, దేయురాలి, మచ్చపుచ్చ్రే బేస్ క్యాంప్ మీదుగా అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. సుమారు రెండు రోజులు మూడు గంటల వ్యవధిలో ఈ యాత్రను పూర్తి చేయడం విశేషం. ఈ క్రమంలో లోతైన లోయలు, సస్పెన్షన్ బ్రిడ్జిలు, నిటారుగా ఉన్న కొండ మార్గాలు, వందలాది మెట్ల బాటలను దాటుకుంటూ ముందుకు సాగారు. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, తీవ్రమైన చలి, శారీరక అలసట వంటి సవాళ్లు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్నారు.

అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కు చేరుకున్న అనంతరం భారత జాతీయ జెండాతో పాటు సామాజిక సమానత్వానికి ప్రతీకగా జై భీమ్ జెండాను, శాంతి, కరుణ, మానవతా విలువలకు ప్రతీకగా పంచశీల పతాకాన్ని ఆవిష్కరించారు. భారతదేశ గౌరవాన్ని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను, గౌతమ బుద్ధుని మానవతా సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే సంకల్పంతో ఈ మూడు పతాకాలను ఆవిష్కరించినట్లు ఎర్ర రమేష్ తెలిపారు.ప్రతికూల పరిస్థితులను అధిగమించి అన్నపూర్ణ బేస్ క్యాంప్‌ను చేరుకోవడం తన జీవితంలో మరచిపోలేని అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. ఎర్ర రమేష్ సాధించిన ఈ విజయం ఓబులాపూర్ గ్రామంతో పాటు మల్లాపూర్ మండల ప్రజలకు గర్వకారణంగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు