రాహుల్ గాంధీ నిర్బంధం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

06-10-2026 | 07:36pm

ములకలపల్లి,అక్టోబర్ 6 (విజయక్రాంతి):ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ములకలపల్లి మండల కాంగ్రెస్ బిఎల్ఎ కోఆర్డినేటర్ సురభి రాజేష్ ఖండించారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత,ఓటర్ల హక్కులు,

ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఇండియా బ్లాక్ నేతలు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారని,ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగించే పరిణామమని  పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం,నిరసన వ్యక్తం చేయడం,ప్రజల తరఫున తమ అభిప్రాయాలను తెలియజేయడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నారు.

ప్రజల ఓటు హక్కు,ఎన్నికల వ్యవస్థపై నమ్మకం,ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై ప్రజల ఆందోళనలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.రాహుల్ గాంధీ  నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల గొంతుకగా నిలుస్తుందని  అన్నారు.ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కాకుండా,వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు