మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
నవచైతన్య యువజన సంఘం
గుండాల, నవంబర్ 28 (విజయ క్రాంతి): యువత మత్తు పదార్థాలకు(Narcotic substances), మాదక ద్రవ్యాలకు(Drugs) దూరంగా ఉండాలని, యువతే ఈ దేశ భవిష్యత్తని పలువురు అభిప్రాయపడ్డారు. నవచైతన్య యువజన సంఘం(Navachaitanya Youth Association) ఆధ్వర్యంలో శనివారం 'మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు యువతపై చూపుతున్న ప్రభావం' అనే అంశంపై టీటీ డబ్ల్యుఆర్జేసీలో నషాముక్త్ యువ సెమినార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల అధికారి వెంకట రాంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ వి సత్యనారాయణ, ఎక్సైజ్ శాఖ ఎస్సై డి నాగామృత, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ.. నేడు యువత విద్యార్థి దశ నుండే క్రమంగా మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు కావడం, మద్యం వినియోగం, సిగరెట్లు, గంజాయి వంటి దురలవాట్లు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్ని రకాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా వినియోగ సంఖ్య క్రమంగా పెరుగుతుందని, అప్రమత్తంగా ఉండి అరికట్టాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను చదివించి ఉన్నత విద్యనభ్యసించడానికి పంపుతున్నారని, వారి కలల్ని సాకారం చేయడానికి కష్టపడాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడి నిండు జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వచ్చే అనారోగ్య ఇబ్బందులు వారి మానసిక పరిస్థితి గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఏ రామచంద్రరావు, యూత్ నాయకులు వినయ్, ముఖేష్, వినయ్, సతీష్, రోషన్, రవివర్మ, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.