గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరుపై హర్షం
టేకులపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) మంజూరు కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం బోడు గ్రామపంచాయతీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి బోడు, కొప్పురాయి ఉమ్మడి గ్రామపంచాయతీల సర్పంచులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా సమావేశమైన నాయకులు, ప్రజాప్రతినిధులు బోడు గ్రామానికి పాఠశాల మంజూరు చేయడాన్ని స్వాగతించారు.
ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక చొరవతో పాటు పాఠశాల మంజూరుకు సహకరించిన సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు (Gratitude) తెలియజేస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించారు.
ఈ పాఠశాల ఏర్పాటుతో బోడు, కొప్పురాయి ఉమ్మడి గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య (Quality Education) అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు విద్యాసంస్థలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.