12 ఏళ్ల తర్వాత.. కొత్తగూడెంకు చంద్రబాబు

26-11-2026 | 11:48am

సత్తుపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత కుటుంబ సమేతంగా కొత్తగూడెం పట్టణానికి రానున్నారు. నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన కొత్తగూడెం చేరుకోనున్నారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వస్తున్నారు.

కొత్తగూడెం కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ (Helipad) వద్ద తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులు చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు. ఆయన పర్యటన (Visit) నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు పాల్వంచలోని నవభారత్ ప్రాంగణంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ అనుబంధం (Political Relations) దృష్ట్యా చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగూడెం పర్యటన సందర్భంగా మంత్రి తుమ్మల స్వయంగా హెలిప్యాడ్ వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలకనున్నారు.

మరిన్ని వార్తలు