డ్రగ్స్‌పై సమరశంఖం.. నేడు కిషన్ రెడ్డి పాదయాత్ర రెండో రోజు

26-11-2026 | 07:15am

హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత జి. కిషన్ రెడ్డి(Union Minister G. Kishan Reddy) చేపట్టిన 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్'(Hyderabad Walks for Drug-Free India) పాదయాత్ర గురువారం రెండో రోజుకు చేరనుంది. ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Roads), అశోక్ నగర్, హిమాయత్ నగర్, లిబర్టీ, ఖైరతాబాద్ మీదుగా సాగి అమీర్‌పేటలోని సత్యం థియేటర్(Satyam Theatre) సమీపంలో ముగియనుంది.

సుమారు 10.9 కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్రలో పలుచోట్ల డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ఇప్పటికే బుధవారం అంబర్‌పేట నుంచి ప్రారంభమైన తొలిరోజు పాదయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు, ఎంపీ కె. లక్ష్మణ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు సినీ నటుడు విక్టరీ వెంకటేష్, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. మూడు రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర నవంబర్ 27న జూబ్లీహిల్స్‌లో ముగియనుంది.

మరిన్ని వార్తలు