పట్టణ ఆరోగ్య కేంద్రం సేవలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష

26-11-2026 | 11:56am

బాన్సువాడ, నవంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) జే. వెంకట్ పట్టణ ఆరోగ్య కేంద్రం యూఎఫ్‌డబ్ల్యూసీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, వైద్య సేవల (Healthcare Services) పురోగతిని సూచికల వారీగా సమీక్షించారు.

ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్య సంరక్షణ (Maternal and Child Health)లో భాగంగా గర్భిణులను 12 వారాల్లోపు నమోదు చేయడం, ఎంసీపీ కార్డుల ప్రాధాన్యత, వైద్యాధికారుల పర్యవేక్షణలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించడం, ప్రసవ ప్రణాళిక రూపొందించడం, ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడటంపై చర్చించారు.

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జీరో డోస్‌తో పాటు మొదటి, రెండో, మూడో డోసులు, పూర్తి స్థాయి వ్యాధి నిరోధక టీకాల (Immunization) కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా ఎన్‌సీడీ కార్యక్రమంపై ప్రత్యేకంగా సమీక్షించారు. వ్యాధుల గుర్తింపునకు స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు, వ్యాధులు నిర్ధారణైన వారికి క్రమం తప్పకుండా తదుపరి వైద్య సేవలు (Follow-up Services) అందించాలని సూచించారు.

ఆరోగ్య సేవలకు సంబంధించిన ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రికార్డుల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. ప్రతి సూచికలో మెరుగైన ఫలితాలు సాధిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రోహిత్ కుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, వైద్యులు డాక్టర్ ప్రకాష్, ఆర్‌ఎంఓ, జిల్లా ఏఎంఓ శ్రీనివాస్ రెడ్డి, ఎన్‌సీడీ సమన్వయకర్త సిద్ధిరామేశ్వర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది, యూఎఫ్‌డబ్ల్యూసీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు