క్యాన్సర్ చికిత్స ఇక చవకే
క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 137 రకాల ఔషధాల ధరలను (Cancer Medicines) తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించడంతో ఔషధాల ధరలు భారీగా తగ్గాయి. ఈ నిర్ణయంతో రోగులపై చికిత్స ఖర్చుల భారం (Treatment Costs) గణనీయంగా తగ్గనుంది.
ఎన్పీపీఏ నిర్ణయం నేపథ్యంలో 76 ఫార్మా సంస్థలు 121 ఔషధాలకు సంబంధించి 1,125 ఫార్ములేషన్ల సవరించిన ధరలను ప్రకటించాయి. సుమారు 600 బ్రాండ్ల మందుల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. కొన్ని ఔషధాలపై గరిష్ఠంగా 96.45 శాతం వరకు ధరల కోత విధించడం విశేషం. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే బాల్బోప్రో క్యాప్సూల్ (Breast Cancer Drug) ధర రూ.40,421 నుంచి ఏకంగా రూ.2,720కు తగ్గింది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సలో వినియోగించే అబిరోన్ ట్యాబ్లెట్ (Prostate Cancer Drug) ధర రూ.41,250 నుంచి రూ.3,218కు దిగివచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఖరీదైన క్యాన్సర్ చికిత్స పొందుతున్న వేలాది మంది రోగులకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది.