కారులో చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం!

09-11-2026 | 10:56am

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పానిపట్‌-ఖతిమా జాతీయ రహదారిపై జగహేరి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు (Speeding Car) అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు వాహనం అంతటా వ్యాపించడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో 10 నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు. మంటల్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు (Police Investigation) చేపట్టారు. ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు