ఏడవ వేతన బకాయిలివ్వాలి

08-11-2026 | 05:05am

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు డిగ్రీ అధ్యాపకుల సంఘం నేతలు శ్రీనివాస్‌గౌడ్, బ్రిజేష్ వినతి

ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నామని ఆవేదన 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో(Government Degree College) పనిచేస్తున్న అధ్యాపకులకు ఏడవ వేతన సవరణ బకాయిలను(Wage revision arrears) విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం(Telangana Government Degree College Lecturers' Association) రాష్ట్ర అధ్యక్షుడు డా.బి.శ్రీనివాసగౌడ్, ప్రధానకార్యదర్శి డా.ఇ.బ్రిజేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను(Bhatti Vikramarka) కలిసి వినతిపత్రం అందజేశారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు ఏడవ వేతన సవరణ బకాయిలను విత్‌డ్రా చేసుకుని వినియోగించుకునే విధంగా సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేటికీ వేతన బకాయిలు అందలేదని, ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8వ వేతన సవరణ అమలు కానుందని, తాము మాత్రం ఇంకా ఎదురుచూపుల్లోనే గడపాల్సి వస్తుందని వాపోయారు.  అలాగే నూతన పెన్షన్ పథకానికి చెందిన అధ్యాపకులకు 2016 జనవరి నుంచి 2019 జూన్ కాలానికి సంబంధించిన వేతన సవరణ బకాయిలు కూడా  నేటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయాయని తెలిపారు.

విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ఈ బకాయిలను సకాలంలో అందుకున్నారని, డిగ్రీ అధ్యాపకులు మాత్రం వివక్షకు గురవుతున్నామని పేర్కొన్నారు.  డిప్యూటీ సీఎం దీనిపై స్పందిస్తూ వీలైనంత త్వరగా బకాయిలను అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అధ్యాపక సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి డాక్టర్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు