బుల్ జోరు.. స్టాక్ మార్కెట్ల దూకుడు

06-11-2026 | 05:35am
  1. ఒక్కరోజే పెరిగిన రూ.8 లక్షల కోట్ల సంపద
  2. ట్రంప్ ఓటమి.. తగ్గిన చమురు ధరలు
  3. భారత మార్కెట్లో విదేశీ పెట్టుబడులు 
  4. లాభాలతో దుమ్మురేపిన సెన్సెక్స్, నిఫ్టీ

ముంబై, నవంబర్ 5: భారత స్టాక్ మార్కెట్లు(Indian Stock Market) ఈరోజు భారీగా దూకుడు పెంచాయి. కొన్ని నెలలుగా దిగాలు పడిన సెన్సెక్స్, నిఫ్టీ గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓటమి.. చమురు ధరలు తగ్గడం.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం.. భారత ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడుల పునరాగమనం.. తదితర కారణాలతో మదుపర్లు స్టాక్ మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు.

దీంతో దలాల్ స్ట్రీట్‌లో మదుపర్ల సంపద ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు పోగైంది. ఉదయం నుంచే ట్రేడింగ్ ఉత్సాహంగా ప్రారంభం కావడంతో సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా ఎగబాకింది. నిఫ్టీ 24,500 మార్క్ దాటింది. ఉదయం 78,710 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 2,008.21 పాయింట్లు లాభపడి 79,310 వద్ద ముగిసింది. 576 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,536 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ 7.7 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. 

బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాల జోరు

బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫైనాన్స్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింది. సెన్సెక్స్‌లో ఆటోమొబైల్ సూచీ 4 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ 3 శాతం, ఐటీ సూచీ 2 శాతం పెరిగాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్ గ్లోబ్  ఏవియేషన్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. ఇండిగో షేర్లు కూడా 5.80 శాతం పెరిగాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీ 4.24 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది.

ముడి చమురు ధర 93.5 డాలర్లకు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ విలువ రూ.94.47 వద్ద స్థిరపడింది. దీంతో విదేశీ మదుపరులు సైతం భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఒక్కరోజే రూ.7,284 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. అయితే.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలు పెరిగినా, అమెరికా వాణిజ్య విధానాల్లో అనిశ్చితి కొనసాగినా స్టాక్ మార్కెట్ మళ్లీ ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దీపావళి పండుగ వేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం  ఒక్కరోజే తులం బంగారం ధర రూ.5,000 పెరిగింది. హైదరాబాద్ బిలియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1.49 లక్షలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.1.35 లక్షలుగా నమోదైంది. కిలోకు రూ.9,000 పెరిగిన వెండి ధర కూడా రూ.2.04 లక్షలకు చేరింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓటమి, డాలర్ బలహీనపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు పసిడి ధర పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా భారత్‌లోనూ బంగారం, వెండికి డిమాండ్ పెరగడంతో ధర పెరిగింది. 

మరిన్ని వార్తలు