పైసా సవాల్!

06-11-2026 | 05:20am
  1. రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక కష్టాలు
  2. ప్రకృతి విపత్తు కారణంగా అదనపు భారం
  3. కేంద్ర ప్రభుత్వ సాయంపైనే గంపెడాశలు
  4. కరువు నివారణకు రూ. 20వేల కోట్లకు ప్రతిపాదనలు
  5. పెరగనున్న ఆర్థిక అవసరాలు ప్రభుత్వానికి పెనుసవాల్
  6. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యత సాధించడమే అసలైన పరీక్ష

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రానున్న నెలలు కీలక పరీక్షగా మారనున్నాయి. ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు బాధ్యత.. మరోవైపు ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అనివార్యత.. ఇంకోవైపు రాష్ట్రంలో భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాల్సిన అవసరం.. వెరసీ ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే సంక్షేమ పథకాల(Welfare schemes) అమలుకు భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తీవ్రతరమైతే వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్ రంగాలకు అదనపు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు కేటాయిం చిన నిధుల విడుదల, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, కొనసాగుతున్న పనులపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎల్ నినో ప్రభావం కేవలం వర్షపాతానికే పరిమితం కాదు. వర్షాలు తగ్గితే పంటల దిగుబడులు పడిపోవడం, రైతుల ఆదాయం తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. భూగర్భజలాల వినియోగం పెరిగి వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అధికమవుతుంది.

తాగునీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. పంట నష్టపరిహారం, పశువులకు మేత, ఉపాధి కల్పన వంటి బాధ్యతలు కూడా ప్రభుత్వంపై పడతాయి. ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక ప్రణాళికకు ప్రధాన సవాలుగా మారనుంది. అయితే గత బడ్జెట్‌లో ఆరు ప్రధాన గ్యారంటీల అమలుకు రూ.50 వేల కోట్లకు పైగా ప్రభుత్వం కేటాయించింది. రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, చేయూత పింఛన్లకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు ప్రతిపాదించింది. ఈ నాలుగు పథకాలకే రూ.42,666 కోట్ల వ్యయం అంచనా వేసింది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు వంటి పథకాలు నిరంతరంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీటితోపాటు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీలు, ఇతర తప్పనిసరి ఖర్చులు కూడా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొత్త ఆర్థిక అవసరాలు పెరిగితే అదనపు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలన్నది కీలకంగా మారనుంది.

24 శాతం వర్షపాతం లోటు, భూగర్భజలాలపై ఒత్తిడి..

వర్షాభావ పరిస్థితులపై ఆందోళనకరమైన గణాంకాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా జూన్ 1  అక్టోబర్ 31 మధ్య రాష్ట్రంలో  831 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, 628 మిల్లీమీటర్లే నమోదైంది. అంటే 24 శాతం లోటు ఏర్పడింది. ఈ జాబితాలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 22 జిల్లాలు ఉన్నాయి. మరోవైపు 621 మండలాల్లో 554 మండలాల్లో భూగర్భజల మట్టాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం ట్యాంకర్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులు, బోర్ల మరమ్మతులు, నీటి రవాణా వంటి చర్యలు చేపట్టాల్సి రావచ్చు. వ్యవసాయరంగాన్ని కాపాడేందుకు ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, పశువులకు మేత, ఉపాధి అవకాశాల కల్పన వంటి కార్యక్రమాలకు నిధులు అవసరమవుతాయి.

ఈ ఖర్చులన్నీ ప్రస్తుత బడ్జెట్‌పై అదనపు భారాన్ని మోపే అవకాశముంది. ఇదిలా ఉండగా పాలమూరు కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల పనులతోపాటు కాలువల నిర్వహణ, చెరువుల పునరుద్ధరణ, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణకు నిధులు అవసరం. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ ఖర్చులు, పంపుల నిర్వహణ, మరమ్మతుల వంటి వ్యయాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు భూగర్భజలాలపై ఆధారపడే రైతుల సంఖ్య పెరిగితే విద్యుత్ వినియోగం కూడా అధికమవుతుంది. దీంతో సాగునీటి రంగానికి కేటాయించిన నిధులు సరిపోతాయా? అదనపు కేటాయింపులు చేయాల్సి వస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతోపాటు ఎల్ నినో ప్రభావం విద్యుత్ రంగంపైనా పడే అవకాశం ఉంది. తాగునీటి పథకాలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్వహణకు విద్యుత్ అవసరం పెరుగుతుంది.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున వినియోగం పెరిగితే సబ్సిడీ భారం అధికమవుతుంది. అక్టోబర్15న రాష్ట్ర విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరింది. వచ్చే వేసవిలో ఈ డిమాండ్ 23 వేల నుంచి 24 వేల మెగావాట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గడిచిన మూడు నెలల్లో విద్యుత్ కొనుగోళ్ల కోసం దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. డిమాండ్ మరింత పెరిగితే విద్యుత్ కొనుగోళ్లకు అదనపు నిధులు అవసరం. దీంతో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ, కొనుగోళ్ల వ్యయం రెండూ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు సవాలుగా మారొచ్చు.

అప్పే గతి!

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గి నీరు, విద్యుత కొరత ఏర్పడితే ఎదుర్కొనేందుకు రూ. 6 వేల కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిధిని తాగునీటి సరఫరా, వ్యవసాయ సహాయం, విద్యుత్ అవసరాలు, నీటి వనరుల నిర్వహణ వంటి అత్యవసర కార్యక్రమాలకు వినియోగించే అవకాశముంది. మరోవైపు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి తొలుత రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం కోరిన ప్రభుత్వం.. అవసరమైతే ఆ డిమాండ్‌ను రూ.30 వేల కోట్లకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదనంగా ఉపాధి హామీ పథకం కింద మరో 50 రోజుల పని కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి ఆశించిన సహాయం అందితే రాష్ట్ర ఖజానాపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. కేంద్ర నిధుల విడుదలలో జాప్యం లేదా తగ్గుదల ఏర్పడితే రాష్ట్ర సొంత ఆదాయాలు, రుణాలపైనే మరింత ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికే సంక్షేమ పథకాలు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు వంటి తప్పనిసరి వ్యయాలు ఉన్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల కోసం అదనపు నిధులు సమకూర్చుకోవడం సులభమైన విషయం కాదు. రాష్ట్ర ఆదాయాల పెంపు, పన్నుల వసూళ్లు, పెట్టుబడుల ఆకర్షణ, రుణాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

వర్షాభావం వ్యవసాయ రంగానికే పరిమితమయ్యే సమస్య కాదు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, కంది వంటి పంటల దిగుబడులు తగ్గితే రైతుల ఆదాయం పడిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గి చిన్న వ్యాపారాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, రవాణా, మార్కెటింగ్ రంగాలు కూడా ప్రభావితమవుతాయి. పంట ఉత్పత్తి తగ్గితే మార్కెట్‌కు వచ్చే సరుకు తగ్గి వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు మందగించే ప్రమాదం ఉంది.

సంక్షేమం, అభివృద్ధి సమతుల్యత అవసరం..

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను సమీక్షించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అత్యవసర తాగునీటి అవసరాలు, సాగునీటి నిర్వహణ, విద్యుత్ సరఫరా, వ్యవసాయ రంగానికి సహాయం వంటి అంశాలకు ప్రత్యేక నిధులు అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో అభివృద్ధి ప్రాజెక్టుల నిధులను అత్యవసర ఖర్చుల కోసం మళ్లించాల్సిన పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి. పూర్తికావడానికి దగ్గరగా ఉన్న ప్రాజెక్టులకు ముందుగా నిధులు విడుదల చేయడం, తక్షణ ప్రయోజనం కలిగించే చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలి.

కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆర్థిక సాధ్యాసాధ్యాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలను అంచనా వేసి దశలవారీగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి శాఖలో ఖర్చుల ప్రాధాన్యతను నిర్ణయించి నిధుల వినియోగంపై కఠినమైన పర్యవేక్షణ అవసరం. ప్రభుత్వం ముందున్న అసలైన సవాలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధి పనులకు నిధులు అందించడం. సంక్షేమ పథకాలు ప్రజలకు తక్షణ ఆర్థిక భరోసా కల్పిస్తే.. అభివృద్ధి ప్రాజెక్టులు భవిష్యత్తులో పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆదాయ వృద్ధికి పునాది వేస్తాయి.

ఈ రెండింటితోపాటు ప్రకృతి సృష్టించే ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఏ ఒక్క రంగాన్ని నిర్లక్ష్యం చేసినా దాని ప్రభావం దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావం ప్రభావం నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. జలాశయాల నిర్వహణ, భూగర్భజలాల సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, విద్యుత్ కొనుగోళ్లు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై కార్యాచరణ అవసరం.

మరిన్ని వార్తలు