లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే!
- తెలంగాణ ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర
- బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
- లక్ష్మణ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
- బీసీఐఎఫ్ చైర్మన్ చిరంజీవులు డిమాండ్
బచ్చన్నపేట, నవంబర్ 5: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్ కుటుంబ సభ్యులను గురువారం బీసీ ఇంటెలెక్చువల్స్ ఫో రం (బీసీఐఎఫ్) హైదరాబాద్ చైర్మన్ టీ. చిరంజీవులు(BCIF Chairman T. Chiranjeevulu) ఆధ్వర్యంలో పలువురు బీసీ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ.. ‘లక్ష్మణ్‌గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ వైఫల్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇది ప్రభుత్వమే చేసిన హత్యగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మహత్యలు ఉండవని, ప్రజల కష్టాలు తీరుతాయని, బడుగు బలహీన వ ర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించి 1,200 మందికి పైగా యువకులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన గుర్తుచేశారు.
కానీ నేడు తెలంగాణ రాష్ట్రం దొరలు, ఆధిపత్య వర్గాల చేతుల్లోకి వెళ్లిందని, తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ఉద్యమకారుల కుటుంబాలకే న్యాయం జరగని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. గత పన్నెండు సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ను పక్కదారి పట్టిస్తూ, ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చని కమిషన్ల ఆధారిత ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు.
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారశైలిపై కూడా ఆయన తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు. లేని భూ వివాదాలను సృష్టించి లక్ష్మణ్ గౌడ్ణు మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతు డి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల సంక్షేమ సౌకర్యాలు, గుర్తింపు, ప్రయోజనాలను లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి కూడా కల్పించాలని కోరారు. లక్ష్మణ్‌గౌడ్ 2006 నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కొనసాగిన నేపథ్యంలో ఆ పార్టీ కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చిరంజీవులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీసీ ఉద్యమకారుడు వట్టే జానయ్య, ఆర్జీవీ మీడియా రాఘవేందర్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకుడు బైరి శేఖర్ గౌడ్, బీసీఐఎఫ్ సభ్యులు అవ్వారు వేణు, చెన్నా శ్రీకాంత్, మామిళ్ల లింగేశ్ యాదవ్, కొండల్ గౌడ్, చంద్ర శేఖర్ ప్రకటించారు.