ఉపాధిగా జల సంరక్షణ

06-11-2026 | 05:05am
  1. గ్రామాల్లో 6 నెలలపాటు ప్రత్యేక కార్యాచరణ
  2. జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్రవ్యాప్త కార్యక్రమం
  3. 355 రకాల పనులతో సమగ్ర ప్రణాళిక
  4. చెరువులు, కుంటలు, వాగులు, కాలువల పునరుజ్జీవానికి ప్రాధాన్యం
  5. ఉపాధి పనులకు అదనంగా రాష్ట్ర నిధులు
  6. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, నవంబరు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో జలవనరులను పునరుజ్జీవింపజేస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు ఆరు నెలల ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. 2027 జనవరి నుంచి జూన్ వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రూపొందిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణతోపాటు భూగర్భజలాల పెంపునకు దోహదపడే పనులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు. గురువారం సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేయాలని, గ్రామస్తులను ముఖ్యంగా వ్యవసాయ కూలీలను పెద్దఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు.

ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ అవసరమని, ఇందుకోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జల వనరులను సృష్టించాలని, సాగునీటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు భూగర్భజలాల లభ్యతను మెరుగుపరిచేలా ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 355 రకాల పనులతో సమగ్ర ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. కార్యక్రమం అమలుకు అవస రమయ్యే అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని భరోసా ఇచ్చారు. 

పూడికతీతకు ప్రణాళికలు సిద్ధం చేయండి

చెరువులు, కుంటలు, వాగులు, కాలువల పునరుజ్జీవానికి ప్రాధాన్యమివ్వాలని, వాటిలో పూడిక తీతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అలాగే చెరువుల తూములు, గేట్లకు మరమ్మతులు చేయడంతో పాటు పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తొలగించాలని పేర్కొన్నారు. సంప్రదాయ జలసేకరణ నిర్మా ణాల పునరుద్ధరణను కూడా భాగం చేయాలన్నారు. పంట కాలువల నిర్మాణం సరిగ్గా ఉంటే సాగు నీటి సదుపాయాల వినియోగం గణనీయంగా మెరుగుపడుతుందని, తద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

చిన్న నదులు, వాగులు, స్థానిక జలప్రవాహాలపై అవసరమైన చోట చెక్‌డ్యాంలను నిర్మించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలను పునరుద్ధరించడం, స్థానికంగా నీటి లభ్యతను పెంచేలా పనులు ఉండాలని, ఇందుకోసం రాజస్థాన్, మహారాష్ట్రలో చేపట్టిన పనులను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ పొందుపరచాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమానికి ఆకర్షణీయమైన పేరు సూచించాలని అధికారులను కోరారు.

జిల్లాస్థాయి భూగర్భజల శాఖ అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్, ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య, నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) రమేష్‌బాబు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి శ్రీనివాస్, భూగర్భజల శాఖ డైరెక్టర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు