ఇందిరమ్మ జీవిత బీమా

06-11-2026 | 05:30am
  1. 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ.. కొత్త పథకం ప్రారంభం
  2. అదేరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ
  3. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు
  4. తెలంగాణ ఫైర్ సర్వీస్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం
  5. కొత్త కోర్టుల్లో 136 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
  6. ప్రపంచ దేశాలతో పోటీపడేలా గ్లోబల్ సమ్మిట్
  7. కొడంగల్ రైతు సభకు సీఎం, మంత్రులు
  8. క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
  9. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని(Indiramma Jeevitha Bima scheme) ప్రవేశపెట్టనుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) తెలిపారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈనెల 19న సిద్దిపేటలో భారీ సభ నిర్వహించి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుందన్నారు. ఈనెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు.

అదే రోజు మహిళలకు ఇందిరమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్న ట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి రెండు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వివిధ శాఖల అవసరాల కోసం రెవె న్యూ శాఖకు సంబంధించిన భూముల బదలాయింపుపైనా స్పష్టమైన నిర్ణయం తీసు కున్నట్లు చెప్పారు. దీపావళి సందర్భం గా నిర్వహించే ‘మా ఇంట్లో ఇందిరమ్మ’ కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీపై చర్చించి ఆమోదం తెలిపినట్లు వివరించారు.

ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు సం బంధించి ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సూచించిన అన్ని పరీక్షలు పూర్తయ్యాయని, అందుకు సంబంధించిన నివే దికలను ఎన్‌డీఎస్‌ఏకు సమర్పించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మూడు బరాజ్‌లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మరమ్మతులకు సంబంధించి ఆఫ్ స్ట్రీమ్‌లో గట్టు నిర్మాణా లు, స్పిల్‌వే అప్రాన్ వెడల్పు, ఎంత మందం తో నిర్మించాలనే అంశాలపై నివేదికలు సిద్ధమైనట్లు చెప్పారు.

ఎన్‌డీఎస్‌ఏ సూచించిన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా మరమ్మతులు చేపడతామని, కాళేశ్వరం ప్రాజెక్టు ను తిరిగి వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డిసెంబర్‌లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నామని, ప్రపంచ దేశాలతో పోటీపడేలా పారిశ్రామిక విధానాలను సరళీకృతం చేయనున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో 136 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.   

మంత్రివర్గం నిర్ణయాలు

దీపావళి సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన 2,25,000 ఇందిరమ్మ ఇళ్లలో నిర్వహిస్తారు.

*ఈనెల 7 నుంచి 9 వరకు కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ పాల్గొంటారు. 9న కొడంగల్‌లో భారీ రైతు బహిరంగ సభ నిర్వహిస్తారు. సీఎం, మంత్రులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటారు.

*ఈనెల 19న సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం, అదే రోజు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తారు.

*ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ యాక్ట్, 2003ను రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.

*తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్, 1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యం, ప్రమాదాలకు కారణాలను గుర్తించడం, వేగంగా స్పందించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు, షాపింగ్ కాంప్లెక్స్  యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారు.

*తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం, 1923లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు ఆమోదం. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించేందుకు నిర్ణయం.

*జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టుకు 56 పోస్టుల మంజూరు. అలాగే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో వివిధ విభాగాలకు మరో 80 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి

  1. సర్కార్ వినూత్న కార్యక్రమం  
  2. వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  
  3. సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి) : ఈ ఏడాది దీపావళి వేడుక లను ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ’ పేరుతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లలో దీపా లు వెలిగించి వారితో కలిసి పండుగ జరుపుకోవాలని సంకల్పించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం గా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని గురువారం తన ఎక్స్ ఖాతాలో సీఎం పోస్టు చేశారు. పేదల సొంతింటి కల సాకారమైన వేళ ఈ దీపావళి లబ్ధిదారులతో కలిసి జరుపుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారు లు కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేడుకల్లో భాగస్వాము లు కావాలని సూ చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పా ల్గొనాలని ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌పై మాస్టర్ ప్లాన్.. 

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం రంజుగా సాగుతున్న వేళ రేవంత్ సర్కార్ దీపావళి సంబురాలను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో జరుపుకోవాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత బీఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం అమలైన తీరును, తమ ప్ర భుత్వం చేపడుతున్న ఇందిరమ్మ స్కీంను పోలుస్తూ అధికార పార్టీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాల్లో మేము ఓట్లు అడగమని, అలాగే బీఆర్‌ఎస్ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఉన్న గ్రామాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు అడగాలని హస్తం పార్టీ ట్రిగ్గర్ చేస్తోంది. ఇటీవల కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏకంగా లబ్ధిదారులతో పండుగ జరుపుకోవాలని నిర్ణయించడం వెనుక పేదలకు ఇండ్ల విషయంలో బీఆర్‌ఎస్ వైఫల్యాన్ని ఎత్తిచూపేలా రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసిందనే చర్చ జరుగుతోంది.


మరిన్ని వార్తలు