ట్రేడ్ డీల్ కుదిరితే 17%.. లేకుంటే 25% సుంకం
న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారైతే భారత దిగుమతులపై సుంకాన్ని 17 శాతానికి పరిమితం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఒప్పందం కుదరకపోతే ఈ రేటును 25 శాతం వరకు ప్రతిపాదిస్తామని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తిలో అధిక సామర్థ్యం ఉందంటూ 14 వాణిజ్య భాగస్వాములపై చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన వచ్చింది. భారత పారిశ్రామిక విధానాలు, కార్మిక రక్షణలు, మార్కెట్ ప్రవేశ పరిమితులు అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది.
అయితే అమెరికా ఆరోపణలను భారత్ అంగీకరించడం లేదు. దేశంలోని ఏ పారిశ్రామిక రంగంలోనూ నిర్మాణాత్మక ఉత్పత్తి మిగులు లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా తాజా నోటీసును పరిశీలిస్తున్నామని, వాణిజ్యపరమైన సమస్యలను ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పేర్కొంది.
ముఖ్యంగా ఉక్కు, ఔషధాలు, వైద్య పరికరాలు, సౌర విద్యుత్, సమాచార సాంకేతిక రంగాలపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామం భారత ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చట్రంపై అంగీకరించాయి. అయినప్పటికీ తుది ఒప్పందం ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు అమెరికాతో చర్చలను వేగవంతం చేసి వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.