వాళ్లిన్ని.. వీళ్లిన్ని!

26-11-2026 | 05:50am

వర్సిటీల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు

  1. ఉన్నత విద్యామండలి వ్యూహాత్మక నిర్ణయం 
  2. ప్రభుత్వ నిధుల కోసం నిరీక్షణకు తెర

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీకి(Osmania University) ల్యాబ్ కావాలంటే, కాకతీయ యూనివర్సిటీకి(Kakatiya University) లైబ్రరీ కావాలంటే, తెలంగాణ యూనివర్సిటీకి(Telangana University) హాస్టల్ భవనం కావాలంటే, పాలమూరు యూనివర్సిటీకి(Palamuru University) మౌలిక వసతులు కావా లంటే.. ఇక ప్రభుత్వం వైపు చూడాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టి, ఆ నిధుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇక మారబోతున్నది. అందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి(Telangana State Council of Higher Education) ప్రత్యేక విధానంపై దృష్టిసారించింది.

యూనివర్సిటీల కోసం కంపెనీలు, పరిశ్రమలు, పూర్వ విద్యార్థుల నుంచి సీఎస్‌ఆర్ నిధులను సమీకరించే ప్రణాళికలను రూపొందించింది. దీని కోసం ప్రత్యేక వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సేకరించిన నిధులతో యూనివర్సిటీల్లో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలు, ప్రాజెక్టుల రూప కల్పన, నూతన భవనాల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేయనుంది. 

ప్రభుత్వ నిధులే కాకుండా!

ప్రతి ఏడాది ప్రభుత్వం బడ్జెట్‌లో యూనివర్సిటీలకు నిధులను కేటాయిస్తోంది. ఎంత ఇస్తుందో చూసుకోవడం, అది చాలకపోతే అదనపు నిధుల కోసం ఫైళ్లు పంపడం, ఆ ఫైళ్లు ఆమోదం కోసం నెలల తరబడి తిరగడం, చివరకు ఏదో కొంత వస్తే దానితోనే నెట్టుకురావడం. కొన్ని యూనివర్సిటీలకు జీతాలకే సరిపోని నిధులు, రీసెర్చ్‌కు ఎక్కడి నుంచి వస్తాయి? ల్యాబ్‌లకు కొత్త పరికరాలు ఎక్కడి నుంచి వస్తాయి? లైబ్రరీలను ఆధునికీకరించడం ఎలా? హాస్టళ్లు, తరగతి గదులు బాగు చేయడం ఎలా? ఈ ప్రశ్నలకు ఏ వైస్ ఛాన్సలర్ దగ్గరా సమాధానం ఉండేది కాదు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన వాటిని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.

ప్రభుత్వం ఇస్తేనే అభివృద్ధి అనే ఆలోచనలోనే యూనివర్సిటీలు కూడా ఇన్నేండ్లు ఉండిపోయాయి. సొంతంగా నిధుల సమీకరణ చేసుకోవాలని, వాటిని యూనివర్సిటీల అభివృద్ధికి ఉపయోగించాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సూచిస్తునే ఉన్నాయి. ఈ క్రమంలోనే నిధుల కోసం కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడకుండా కంపెనీల నుంచి సహకారం తీసుకోవాలని ఉన్నత విద్యామండలి సరికొత్తగా ఆలోచన చేసింది. ఇలా వచ్చిన నిధులను ఆ సంస్థ ఏ యూనివర్సిటీకి ఖర్చు చేయాలని సూచిస్తే వాటి కోసం ఖర్చు చేయనున్నారు. 

కేవలం కంపెనీలే కాదు..

ప్రభుత్వం ఇచ్చే నిధులపై మాత్రమే ఆధారపడకుండా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించాలని మండలి నిర్ణయించింది. ఇది చాలా దేశాల్లో, ముఖ్యంగా అమెరికా, యూరప్‌లాంటి దేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఎప్పటి నుంచో ఈ విధానం అమల్లోకి ఉంది. అక్కడి యూనివర్సిటీలు ప్రభుత్వ నిధుల కంటే ఎక్కువగా సీఎస్‌ఆర్ తరహాతోపాటు పూర్వ విద్యార్థుల విరాళాలతోనే నడుస్తున్నాయి.

మన దగ్గర కూడా గుజరాత్ లాంటి రాష్ట్రాలు సీఎస్‌ఆర్ నిధులను అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటి (విద్యా సామాజిక బాధ్యత)కు వినియోగిస్తున్నాయి. ప్రతి కంపెనీ తమ లాభాల్లో సుమారు రెండు శాతం మేర ఫండ్‌ను సీఎస్‌ఆర్ నిధుల కింద కేటాయించాలి. ఆ కంపెనీలను వెళ్లి సంప్రదించడం ద్వారా ఎంతో కొంత నిధులను విద్యాసంస్థలకు కేటాయించే వీలుంది. ఈక్రమంలోనే రాష్ట్రంలోని పేరున్న పరిశ్రమలు, కంపెనీలను కలిసి అవసరమైన నిధులను సమకీరించనున్నారు. 

ప్రభుత్వంపై తగ్గనున్న భారం..

సీఎస్‌ఆర్ నిధులను సేకరించడం ద్వారా ప్రభుత్వంపై కూడా భారం తగ్గే అవకాశం ఉంది. ప్రతి ఏటా బడ్జెట్‌లో కేటాయించే నిధుల విడుదల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. అవి యూనివర్సిటీలకు అందాలంటేనే నెలల తరబడి సమయం పడుతోంది. ఈలోగా యూనివర్సిటీల అవసరాలు తీరడం కష్టంగా మారుతోంది. కేటాయించిన నిధులను విడుదల చేయాలంటూ వర్సిటీల వీసీలు పదే పదే ఉన్నతాధికారులను కోరడం జరుగుతోంది. నిధుల కోసం విద్యాబోధన కుంటుపడొద్దనే ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.

రాష్ట్రంలోని కంపెనీలతోపాటు, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ ఇతర యూనివర్సిటీల నుంచి చదివి ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారు వేల మంది ఉన్నారు. తాము చదివిన యూనివర్సిటీకి ఏదైనా చేయాలనే తపన వారిలో చాలా మందికి ఉంటుంది. కానీ ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ డబ్బు సరిగ్గా ఖర్చవుతుందా లేదా? అనే అనుమానంతో వెనక్కి తగ్గుతుంటారు.

పారదర్శకమైన వ్యవస్థ ఉంటే, తమ విరాళం ఏ వర్సిటీకి, ఏ ల్యాబ్‌కు, ఏ రీసెర్చ్‌కు, ఏ విద్యార్థి స్కాలర్ షిప్‌కు వెళ్లిందో తెలిస్తే వారు ముందుకు వస్తారు. ఒక చిన్న క్లాస్ రూమ్ కట్టించినా, పెద్ద భవనం కట్టించినా? ఒక లైబ్రరీకి పుస్తకాలు ఇచ్చినా, అది వారికి గర్వకారణమే. కంపెనీల సహకారంతో ఆ నిధులను ఆయా వర్సిటీల అభివృద్ధికి విద్యామండలి కేటాయించనుంది. 

కీలక ముందడుగే..

తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ముందడుగు వేసిందనే చెప్పాలి. తెలంగాణలో కార్పొరేట్ కంపెనీలకు కొదవ లేదు. హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మా, బయోటెక్, నిర్మాణ రంగంలో వందలాది పెద్ద కంపెనీలు ఉన్నాయి. చట్టం ప్రకారం వారు తమ లాభాల్లో దాదాపు రెండు శాతం సీఎస్‌ఆర్ కింద ఖర్చు చేయాలి. ఇప్పటివరకు ఆ నిధులు ఎక్కువగా పాఠశాలలు, ఆస్పత్రులు, ఆరోగ్య శిబిరాలు, మరుగుదొడ్లు వంటి వాటికే వెళ్తున్నట్లు తెలుస్తోంది యూనివర్సిటీలకు, రీసెర్చ్‌కు అవి పెద్దగా చేరడం లేదు.

ఉన్నత విద్యా మండలి ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఆ నిధులను యూనివర్సిటీల వైపు మళ్లించగలిగితే, అది పెద్ద మార్పుకు దారి తీస్తుంది. కంపెనీలకు కూడా ఇది లాభమే. వారికి కావాల్సిన నైపుణ్యం ఉన్న విద్యార్థులు, వారి రంగానికి అవసరమైన రీసెర్చ్ యూనివర్సిటీల నుంచే వస్తాయి. యూనివర్సిటీ- అనుసంధానం ఏర్పడుతుంది. 

మరిన్ని వార్తలు