ఏపీలో పల్లెపోరు షురూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా 3,240 గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. తమ గ్రామానికి నాయకత్వం వహించే సర్పంచ్‌ను ఎన్నుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో ఓటర్లు క్యూలైన్లలో కనిపించారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు 31,614 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ దశలో 74,45,583 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 70 వేల మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
మరోవైపు గ్రామీణ ఎన్నికలతో పాటు నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లోనూ పోలింగ్ కొనసాగుతోంది. ఈ రెండు ఎన్నికల ప్రక్రియల్లో కలిపి 99,43,895 మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.