పెళ్లి సంబరం విషాదం.. లారీ ఢీకొని నలుగురు దుర్మరణం
అనంతపురం: పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపి ఇంటికి తిరిగి వెళ్తున్న వారిని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులు తాడిపత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొంది. ఈ ఘటనలో వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంలో గాయపడిన మరో ఎనిమిది మందిని స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. పెళ్లి వేడుకతో సంతోషంగా గడిపి తిరిగొస్తున్న కుటుంబంలో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది.