నేడే అచ్చంపేటకు సీఎం రేవంత్
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.450 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
పర్యటనలో భాగంగా తొలుత అమ్రాబాద్ మండలం మద్దిమడుగుకు చేరుకోనున్న సీఎం.. లంబాడీ సమాజ ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. అలాగే పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి, హరిత హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం హెలికాప్టర్ ద్వారా అచ్చంపేటకు చేరుకుని అక్కడి నుంచి బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా బీటీ రహదారుల అభివృద్ధి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, అచ్చంపేట మున్సిపాలిటీ మౌలిక సదుపాయాలు తదితర పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
మరోవైపు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ, కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తంగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలతో సీఎం పర్యటనపై నాగర్ కర్నూల్ జిల్లా ప్రజల్లో ఆసక్తి నెలకొంది.