ప్రేమించిన వ్యక్తి వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ప్రేమించిన వ్యక్తి వివాహానికి నిరాకరించడంతో ఓ యువతీ తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్(Ghat Kesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, యువతి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన యువతి ఐశ్వర్య (22) ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేయబడింది. ఐశ్వర్యకు గత సంవత్సరం నుండి జామ కిరణ్ కుమార్ అనే యువకుడితో ప్రేమ సంబంధం ఉందని, ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిపించాలని నిర్ణయించారు.
అయితే కిరణ్ కుమార్ తల్లి వివాహ ప్రతిపాదనను నిరాకరించడంతో పాటు, కిరణ్ కుమార్ కూడా ఐశ్వర్యతో మాట్లాడటం మానేసి, వివాహానికి నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఐశ్వర్య 18న బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 19న గురువారం ఉదయం 8:59 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కిరణ్ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.