పోక్సో కేసులో ముగ్గురికి జైలు
ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు
ఎల్బీనగర్: ఇన్ స్టాగ్రామ్(Instagram)లో పరిచయమైన మైనర్ ని వేధించిన కేసులో ముగ్గురు నిందితులకు జైలుశిక్ష విధిస్తూ ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు(LB Nagar Fast Track Court) తీర్పు వెలువరించింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ప్రధాన నిందితుడికి ఏడేండ్లు, మరో ఇద్దరికి ఐదేండ్ల జైలుశిక్ష విధిస్తూ, బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే... చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేటలో ఒక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న మైనర్ ను ఇన్ స్టాగ్రామ్ లో వరంగల్ జిల్లా, గోవిందరాజులగుట్ట, గిర్మాజీపేటకు చెందిన పోలేపాక అరుణ్ పాల్ పరిచయం చేసుకున్నాడు.
కాగా, 06-04-2023న అరుణ్ తన స్నేహితులు పవన్ కళ్యాణ్, అన్వేష్‌తో కలిసి కొత్తపేటలోని బాలిక చదువుకుంటున్న పాఠశాల వద్దకు వచ్చి, ఆమెను కారులో ఎక్కించుకుని, అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై మైనర్ కుటుంబ సభ్యులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై జి.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా, పోలీసులు నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
అలాగే, బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేశారు. ఈ కేసును ఎల్బీనగర్ లోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టి, న్యాయమూర్తి పద్మావతి గురువారం తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితుడికి అరుణ్ పాల్ కు ఏడేండ్లు, కల్యాణ్, అన్వేష్ కు ఐదేండ్ల జైలుశిక్ష, రూ. 3 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. బాధితురాలికి పరిహారంగా రూ.50 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో దర్యాప్తు అధికారి, సబ్-ఇన్స్పెక్టర్ జి. రవి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి.సత్యనారాయణ, కృష్ణ ప్రసన్న కీలకంగా వ్యవహరించారు.