మహిళలే మా ప్రభుత్వ ప్రాధాన్యం
సిద్దిపేట: తెలంగాణలో మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు నుంచి ఉచిత విద్యుత్ వరకు పలు పథకాలను మహిళలకు అండగా నిలిచేలా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని, అర్హులైన పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని వివరించారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు మహిళా సంఘాలకు బస్సుల నిర్వహణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత పదేళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రాధాన్యత ఇవ్వలేదని సీతక్క విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.