ఇందిరమ్మ భూములు ఇస్తే రేవంత్ లాక్కుంటున్నాడు
హయత్ నగర్ లో దళితుల భూమి తీసుకోవడం దారుణం
వారం రోజుల్లో స్పందించకుంటే.. ప్రహారీని నేనే కూల్చుతా
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ఎల్బీనగర్: దళితుల ఎక్ సాల్ పట్టా భూముల(Dalits ex-sal patta lands) స్వాధీనంపై ప్రభుత్వ తీరును మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. దళితులకు ఇందిరమ్మ భూములు ఇస్తే రేవంత్ రెడ్డి(Revanth reddy) లాక్కుంటున్నాడని, వారం రోజుల్లోగా ఈ భూములపై నిర్ణయం తీసుకోవాలి లేదంటే ప్రభుత్వం పెట్టిన గోడను నేనే కూలగొడతానని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హయత్నగర్ పరిధిలోని సర్వే నంబర్ 255లో 37 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితుల ఎక్ సాల్ పట్టా భూములను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కేటాయిస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి(Former Corporator Kallem Navajivan Reddy) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) బాధితులతో కలిసి భూములను సందర్శించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు భూములకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లుగానే పేదలకు గతంలో కేటాయించిన అసైన్డ్, ఎక్ సాల్ పట్టా భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని, అది సాధ్యం కాని పక్షంలో కనీసం సగం భూమినైనా బాధితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీసు బందోబస్తు మధ్య ప్రీకాస్ట్ గోడల నిర్మాణం చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పేదలు, దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్, ఎల్బీనగర్ ఇన్ చార్జి సామ రంగారెడ్డి, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.