అభినవ బుద్ధుడు కాన్షీరామ్

09-10-2026 | 05:00am

సామాజిక అంతరాలు, పీడనలు, దోపిడీలను, మనువాద రాజకీయాలను అంతమొందించడానికి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని, తల్లిదండ్రులను, కుటుంబం, వికాసవంతమైన జీవితాన్ని వదిలిన అభినవ బుద్ధుడు కాన్షీరామ్(Kanshi Ram). తల్లిదండ్రులను, భార్యబిడ్డలను, రాజ్యాన్ని.. సకల సాకార్యాలను వదిలి దేశసంచారం చేసిన గౌతమ బుద్ధుడిలాగా కాన్షీరామ్‌ది కూడా మహోన్నతమైన చరిత్ర. అక్టోబర్ 9 కాన్షీరామ్ వర్ధంతి. సంప్రదాయ రాజకీయాలను మలుపుతిప్పిన ధీరుడు. మనువాద భావజాలాన్ని, కుటిల రాజకీయాల మెడలు వంచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ఆచరణలో చూపించిన బహుజన నాయకుడు కాన్షీరామ్.

పంజాబ్ రాష్ట్రం రోపార్ జిల్లా ఖా వాజ్‌ఫూర్‌లో మార్చి 15, 1934లో హరిసింగ్, బిషన్‌సింగ్ కౌర్ దంపతులకు జన్మించిన మొదటి మగ సంతానం కాన్షీరామ్. చిన్నతనం నుంచే సంప్రదాయ వ్యతిరేక వైఖరి. సిక్కు సంప్రదాయాల ప్రకారం పెంచాల్సిన జుట్టును కత్తిరించుకున్నారు. తన రోజువారీ ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా చిన్నచిన్న పనులు చేసి సంపాదించుకు న్నాడు. రోపార్‌లో బీఎస్సీ పూర్తి చేసిన ఆయనకు డెహ్రాడూన్‌లోని భారతీయ సర్వే విభాగంలో ట్రైనీ అధికారిగా ఉద్యోగం వచ్చింది.

అదే సమయంలో అంబేద్కర్ మరణించారు. ఆ సందర్భంలో దళిత ఉద్యోగులంతా దుఃఖసాగరంలో మునిగిపోవడం చూసి అంబేద్కర్ గురించి తెలుసుకోవాలనే తపన కాన్షీరాంలో కలిగింది. తన సహ ఉద్యోగి శ్రీగైనీ ద్వారా అంబేద్కర్ గురించి లోతైన విషయాలను తెలుసుకున్నారు. అదే సమయంలో రక్షణ పరిశోధనశాఖలో పోటీ పరీక్ష రాసి పుణెలోని డిఫెన్స్ లాబోరేటరీలో సైంటిఫిక్ అధికారిగా చేరారు. 

మిత్రులతో కలిసి.. 

1964లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసిన కాన్షీరామ్.. తన మిత్రులు మనోహర్ అటే, డికే ఖపార్టే, శ్రీగైనీ, తంబాఖే, మధపరిహార్, భీమ్రావు దళాళ్ వంటి వారితో కలిసి పుణె కేంద్రంగా మహారాష్ట్ర అంతటా ఉద్యోగులను కలుసుకుంటూ తిరగడం ప్రారంభించారు. 1965 నుంచి 1971 వరకు రిపబ్లికన్ పార్టీ పునర్నిర్మాణం కోసం నిర్విరామంగా కృషి చేశారు.

1982లో పరిమిత రాజకీయ కార్యాచరణలో భాగంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో డీఎస్-4 ద్వారా ఏకంగా 42మంది అభ్యర్థులను బరిలో దిం చారు. మొత్తం పోలైన ఓట్లలో 1.19శాతం ఓట్లను సాధించి డీఎస్-4 అభ్యర్ధులు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ (ఎస్) వంటి జాతీయ పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు సాధించి తమ ఉనికి చాటుకున్నారు.

సొంత పార్టీకి పురుడు.. 

హర్యానా ఎన్నికల తర్వాత మన ఓటు మనకే వేసుకోవాలనీ, మన టికెట్ మనమే ఇచ్చుకోవాలనీ వచ్చిన చైతన్య స్పృహను ఆచరణ రూపంలోకి మార్చాలని నిర్ణయించారు. రాజకీయ పార్టీ ఆవశ్యకతను గుర్తించి బామ్‌సెఫ్, డీఎస్-4 కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలు, అభిమానుల సమక్షంలో 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ‘బహుజన్ సమాజ్ పార్టీ’ని స్థాపించారు.

పార్టీ రూపొందించిన నినాదాలు అగ్రకుల పాలక పార్టీల్లో భయాన్ని.. బహుజన సమాజ్ కార్యకర్తల్లో ఉత్తేజాన్నినింపాయి. బహుజన రాజ్యాన్ని భారతదేశం మొత్తం సాకారం చేయడం కోసం తన ఆఖరిక్షణం వరకు పరితపించిన గొప్ప యోధుడు. అర్ధంతరంగా అనారోగ్యానికి గురయ్యారు.  2006 అక్టోబర్ 9 రాత్రి ఈలోకాన్ని విడిచి వెళ్లారు.

సీనియర్ జర్నలిస్ట్. 98488 22333

ఇ. చంద్రశేఖర్ 

మరిన్ని వార్తలు