ఆశీర్వాదమడిగిన దేవముని

10-10-2026 | 05:00am

నన్ను ప్రసంగించడానికి గ్రంథకర్తలు గ్రంథావిష్కరణ(Authors and Book Launch) సభలకు పిలిచినట్లే, దసరా, దీపావళి, ఉగాది, గణేశ్ చతుర్థీ మొదలైన పండుగల్లో ప్రసంగించడానికి నిర్వాహకులు పిలుస్తారు. గణేశ్ చతుర్థీ వస్తే హైదరాబాదు నగరం గణేశ మండపాలతో నిండిపోతుంది. లక్షల సంఖ్యలో వినాయక ప్రతిమలు పూజలందుకుంటాయి.

గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ‘మారుతీనగర్ సంక్షేమ సంఘం’ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేశ్ ఉత్సవంలో పాల్గొనటానికి నా మిత్రుడైన నాగపురి నరసింహాచార్యులు ఆహ్వానించాడు. ఆహ్వాన పత్రంలో ముఖ్య అతిథిగా నా పేరు రాసి వాట్సాప్‌లో పంపించాడు.

సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ఎవరూ స్వయంగా ఇంటికి వచ్చి ప్రసంగించడానికి పిలిచే అవకాశం లేదు. సెప్టెంబర్ 5న నా ప్రసంగం ఆ రోజు మరీ గుర్తు పెట్టుకొని ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టె ఆదివారం కూడా కావడం వల్ల కార్యక్రమానికి ఉదయం పదిన్నరకు గణేశ్ మండపంలో ఉండే విధంగా క్యాబ్ కట్టుకొని బయల్దేరాను. అప్పటికే భక్తులు అధిక సంఖ్యలో వచ్చినారు. యజ్ఞ కార్యక్రమం ప్రకటించబడింది. ఆ కార్యక్రమానికి వేద సింధుగారు నేతృత్వం వహించాడు. ఆయన తన శిష్యులతో అక్కడికి వచ్చినాడు. తోడుగా తన తండ్రిగారిని కూడా తీసుకొని వచ్చాడు. 

యజ్ఞంలో పాల్గొనటానికి వచ్చిన వారిలో నా ప్రియమిత్రుడు రఘువీర ప్రతాప్ ఉన్నాడు. అతడు ఆ బస్తీలోనే ఉంటాడు. రఘువీర్ గారు భార్యాసమేతుడై యజ్ఞ వేదికముందు కూర్చున్నాడు. యజ్ఞ దంపతులుగా కూర్చున్నవారిలో నాకు ఒక్క రఘువీర్ ప్రతాప్ మాత్రమే తెలుసు.

యజ్ఞ కార్యక్రమం సుమారు మూడు గంటలు వైభవోపేతంగా జరిగింది. యజ్ఞబ్రహ్మ మధ్య మధ్యన ప్రసంగిస్తూ, మంత్రపూర్వకంగా యజ్ఞ కార్యక్రాన్ని నిర్వహించాడు. యజ్ఞ  బ్రహ్మ యువకుడు, పండితుడు కనుక అతని అర్ధవంతమైన ప్రసంగాన్ని అందరూ చెవులతో విన్నారు. ఐతే మూడు గంటలపాటు యజ్ఞంలో ఎలా పాలు పంచుకున్నారో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి సత్యనారాయణ వ్రతం చేసినా రెండు మూడు గంటలకు తక్కువ సమయం పట్టదు.

వైదిక సామూహిక యజ్ఞం కనుక నేను పాల్గొన్న ఆ యజ్ఞ కార్యక్రమం మూడు గంటలు తీసుకున్నది. అట్టి సభకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన వ్యక్తి నా చిరకాల మిత్రుడు. గత సంవత్సరం కూడా నేను ఇదే కార్యక్రమంలో పాల్గొన్నాను. కాని ఈసారి మూడు గంటలపాటు కార్యక్రమంలో ఒకేస్థానంలో కదలకుండా కూర్చోవడం కష్టమైంది. యజ్ఞం జరుగుతున్నప్పుడు యజ్ఞం గురించి తెలిసిన వారెవ్వరూ వారి వారి స్థానాల నుంచి లేచిపోవడం మర్యాదగా ఉండదు. నేను యజ్ఞ బ్రహ్మ ప్రక్కనే ఉన్నాను. వారి ఉపన్యాసం వింటూ ఆ మూడు గంటలు ఎట్లా గడిపానో నాకే తెలియదు. నా అదృష్టంకొద్ది నా సెల్‌ఫోన్ కూడా మ్రోగలేదు. నా ప్రక్కన వానప్రస్థి దేవముని ఉన్నాడు.

యజ్ఞం ముగింపునకు వచ్చింది. పూర్ణాహుతి ఇవ్వడమైంది. యజ్ఞానంతర ప్రార్థనతో నేను ఊపిరి పీల్చుకున్న వాడనయ్యాను. చివర్లో హారతి కూడా ఇచ్చారు. అంతసేపు కూర్చున్న నాలో అసహనం పెరిగింది. కాని మర్యాదగా కూర్చున్నాను. నన్ను ముఖ్య అతిథి ప్రసంగానికి ఎప్పుడు అనుమతి ఇస్తారని అని ఎదురుచూశాను. కాని యజ్ఞబ్రహ్మ ఆశీర్వాద కార్యక్రమం ఉన్నది కనుక, ఆ తర్వాత నన్ను ప్రసంగించమన్నాడు నా మిత్రుడు. అప్పటికీ సమయం చాలా అయ్యింది. నేను సమయాన్ని బట్టి మాట్లాడే వ్యక్తినే, మధ్యన ఆపమన్నా నా ప్రసంగాన్ని నిరభ్యంతరంగా ఆపుతాను. 

మూడు గంటలు కదలకుండా ఒకే స్థానంలో కూర్చున్న నన్ను నా మిత్రుడు ఐదు నిమిషాలు మాట్లాడమని కోరాడు. సమయం తీసుకొని ఇంటి నుంచి బయల్దేరి కార్యక్రమంలో పాల్గొని అంతసేపు కూర్చున్న ముఖ్య అతిథిని ‘ఐదు నిమిషాలు మాట్లాడండి’ అనడం కొంచెం నాకు బాధ కల్గించింది. ఐనా సమయాభావం వల్ల అలా నన్ను కోరారని భావించాను. నిజానికి యజ్ఞ కార్యక్రమం సాహిత్య కార్యక్రమం లాంటిది కాదు కదా! ముఖ్య అతిథి, ఆత్మీయ అతిధులు, గౌరవ అతిధులు, వక్తలు ఉంటానికి? నా ప్రియమిత్రుడు పిలిచాడు కనుక ముఖ్య అతిథిగా వచ్చాను. మరొక చోటికైతే వెళ్లే వాడినే కాదు.

నిర్వాహకుని సూచన మేరకు నా ప్రసంగాన్ని ఐదు నిమిషాల్లో ముగించాను. ఆ తర్వాత యజ్ఞ బ్రహ్మ యజ్ఞ దంపతలును ఆశీర్వదించాడు. విచిత్రమేమంటే నా ఆశీర్వాదం ఎవరైనా కోరుతారా అని ఎదురుచూశాను. యజ్ఞంలో పాల్గొన్న వారెవరూ నా ఆశీర్వాదం కావాలని అడగలేదు. వేదికముందు నా ప్రియమిత్రుడు రఘువీర ప్రతాప్ కోసం నా కళ్లు వెదికాయి. కాని అప్పటికే ఆయన అక్కడినుంచి నిష్క్రమించాడు.

అతని అర్ధాంగి నా దగ్గరికి వచ్చి ‘రఘువీర్ పనిమీద తొందరగా వెళ్లవలసి వచ్చింది గురువుగారూ మీతో చెప్పమన్నారు’ అని వినయంగా చెప్పింది. ఆ యజ్ఞ కార్యక్రమంలో మా నరసింహాచారి నా చేత రఘువీర్ గారికి సన్మానపత్రం అందజేసి, సన్మానింపజేశాడు. రఘువీర్ గొప్పకవి ఫారెస్టు డిపార్ట్‌మెంటులో ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే కవితా రచనలు చేయగలిగిన ధీశాలి. అతణ్ణి సన్మానించడం నాకు ఆనంద కారకమైంది.

ఆ రోజు అతణ్ణి సన్మానించడం వల్ల  అతని షష్టిపూర్తి కార్యక్రమంలో పాల్గొనని లోటు తీరింది. యజ్ఞబ్రహ్మ ఆశీర్వాదం అందుకున్న వారు కొందరు భోజనశాలకు పరిగెత్తారు. మరికొందరు వినాయక మండపంలో పూజల్లో పాల్గొన్నారు. మరికొందరు ముచ్చట్లలో మునిగారు.

నాకా సమయంలో ఏం చేయాలో తోచలేదు. వేదిక మీదనే ఒకచోట కూర్చున్నాను. ఇంతలో ఒక సంఘటన జరిగింది. నా ప్రక్కనున్న దేవముని దయానందుని మార్గంలో నడుస్తున్న ఆర్య సామాజికుడు, వానప్రస్థి. అతడు నాతో పాటు మూడు గంటలు నా ప్రక్కనే కూర్చున్నాడు. నిశ్శబ్దంగా నాకే మాట్లాడడానికి ఐదు నిమిషాలు దొరకనప్పుడు, ఆయనకు మాట్లాడటానికి సమయం ఎట్లా లభిస్తుంది? పాపం ఆయన నా ప్రక్కనే ఉన్న నాతో ఒకమాట కూడా మాట్లాడలేదు వేదిక మీద.

కాని అకస్మాత్తుగా దేవముని కొన్ని పూలు నా చేతికందించి తనను ఆశీర్వదించమని నా పాదాలమీద పడ్డాడు. నాకాశ్చర్యం కల్గింది. ‘నేనుమిటి మిమ్మల్ని ఆశీర్వదించడమేమిటి?’ అని ప్రశ్నించాను. “మీరు వేదవేదాంగవేత్తలు, ఉపనిషత్తులు చదువుకున్నారు. మీ గురించి నాకు బాగా తెలుసు. అందుకే మీ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను” అని పలికే సరికి నా కళ్లు చెమ్మగిల్లాయి. నిజానికి వయస్సులో పెద్దవాళ్లు ఆశీర్వదించడం మన సంప్రదాయం. దేవముని దృష్టిలో నేను ఆయనకంటె వయస్సులో పెద్దవాడినేమి కాదు. కొంచెం జ్ఞానంలోను పెద్దవాడిని కావచ్చు. అందుకే ఆ గౌరవం!

నన్ను అమితంగా గౌరవించే దేవమునిని ‘బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించాను. ఆనాటి కార్యక్రమంలో ఒక్కరైనా నా ఆశీర్వాదాన్ని పొందినందుకు నేను ఎంతో సంతోషించాను. ఇక్కడ నేనతని గురించి రెండు మాటలు చెప్పాలి.

నేను 70 గ్రంథాల రచయితను. వాటిలో 60 గ్రంథాలు వైదిక సిద్ధాంతానికి అనువైనవే. వాటిలో ‘కోకిల’ అనే పద్యకావ్యం ఒకటి. దాన్ని నా మిత్రుడు విశాఖపట్నం వాస్తవ్యుడు డాక్టర్ కె.జి. వేణు ‘నాకునచ్చిన పుస్తకం ‘పేరుతో’ షార్ వాణి సాహిత్య దృశ్యమాస పత్రిక’లో గొప్పగా సమీక్ష చేశాడు.

దాన్ని చదివిన దేవముని కోకిల పుస్తకం పంపమని వంద రూపాయలు ‘గూగుల్ పే’ చేశాడు. నేను వారు చెప్పినట్లు పుస్తకం పంపిస్తే, అది వారికందక చివరికి నా దగ్గరికే వచ్చింది. పుస్తక ప్రేమికుడు, వైదిక ధర్మాభిమాని దేవముని ఒకరోజు స్వయంగా మా ఇంటికి వచ్చి ‘కోకిల’ను తీసుకొన్నాడు. దానితో పాటిచ్చిన నా గ్రంథాలను అతడు చదివి స్ఫూర్తిని పొందినాడు. అట్టి మహానుభావుడు ఆ యజ్ఞ వేదిక మీద నా ఆశీర్వాదం కోరడం ఒక మరవలేని సంఘటనగా నా స్మృతిలో నిలిచిపోయింది.

వ్యాసకర్త సెల్: 9885654381


మరిన్ని వార్తలు