ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ ఔట్
- భారత్‌లో ఆడేందుకు నిరాకరణ
- బంగ్లాదేశ్‌కు అవకాశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ప్రతిష్టాత్మక ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ(Asia Champions Trophy Hockey) టోర్నీ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. భద్రతా కారణాలతో భారత్‌లో పర్యటించేందుకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ నిరాకరించడంతో ఆ జట్టు టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ టోర్నీని వేరే దేశానికి తరలించాలని లేదా తమ జట్టు ఆడే మ్యాచులను తటస్థ వేదికలపై నిర్వహించాలని పీహెచ్‌ఎప్ అధ్యక్షడు మోహిద్దీన్ అహ్మద్ డిమాండ్ చేశాడు. అయితే, అతడి విజ్ఞప్తిని ఆసియా హాకీ ఫెడరేషన్(ఏహెచ్‌ఎఫ్) తిరస్కరించింది.
రిజ్వర్ జట్టుగా ఉన్న బంగ్లాదేశ్‌కు పాక్ స్థానంలో అవకాశం దక్కింది. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను హాకీ ఇండియా రిలీజ్ చేసింది. భారత్, బంగ్లాదేశ్, మలేసియా, జపాన్, కొరియా, చైనా పోటీ పడుతున్నాయి. సింగిల్ రౌండ్ -రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగిలిన 5 జట్లతో చెరో మ్యాచ్ ఆడుతుంది.
లీగ్‌దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా భారత్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఆరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.