రాహుల్‌ది ప్రమాదకర ధోరణి!

10-10-2026 | 05:25am
  1. అనుకూలమైతే ప్రజాస్వామ్యం.. లేకుంటే దుష్ప్రచారమా? 
  2. వ్యవస్థలను శాసించాలనుకోవడం చట్ట విర్దుధం 
  3. రాజ్యాంగ సంస్థలు మీ జేబు సంస్థలు కావు 
  4. ప్రజల తీర్పును గౌరవించాలి
  5. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు   

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రాహుల్‌గాంధీ(Rahul Gandhi) వ్యవహారశైలి చూస్తుంటే వింత, విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) విమర్శించారు. రాజ్యాంగ, ప్రభుత్వ వ్యవస్థలు వారికి అనుకూలంగా వ్యవహరించినప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైనవని ప్రశంసించడం.. లేకుంటే అదే వ్యవస్థలపై దుష్ప్రచారం చేయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.

ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), న్యాయవ్యవస్థ, పార్లమెంట్ కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించలేదనే అక్కసుతో ఆయా సంస్థలపై విష ప్రచారం చేయడం, ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.

పదేపదే అబద్ధాలను ప్రచారం చేయడం, ఆందోళనలకు దిగడం, యువతను రెచ్చగొట్టడం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం రాహుల్ రాజకీయ కుట్రేనని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనను విడుదల చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిపైన  నిరసనల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించడం, అవమానించడం, బెదిరించడం, అసభ్య పదజాలంతో దూషించడం ఒక పథకం ప్రకారం సాగుతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలను యావత్ దేశ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.  

ప్రధాని పదవి ఈసీ బాధ్యత కాదు!     

రాహుల్‌గాంధీని దేశ ప్రజలు విశ్వసించడం లేదని, ప్రజలు ఆయనను అనేక ఎన్నికల్లో తిరస్కరించారని, అది ఎన్నికల సంఘం తప్పు కా దని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేయడమో, లేక కాంగ్రెస్‌ను కానీ, బీజేపీని కానీ మరే ఇతర పార్టీనైనా గెలిపించడమో ఎన్నికల సంఘం బాధ్యత కాదు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం వరకే ఎన్నికల సంఘం బాధ్యత.

ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించుకోవడం, ప్రజల మద్దతు కూడగట్టి ఓట్లు పొందడం మీ బాధ్యత. కానీ ఆ విషయంలో మీరు పూర్తిగా విఫలమవుతున్నారు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులు తమకు అనుకూలంగా లేనప్పుడు వాటిని తప్పుపట్టడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిందన్నారు. బాధ్యతాయుతమైన కీలకమైన ప్రతిపక్ష నేత స్థానాన్ని తప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం దిగజార్చుతున్నారని, అగౌరవ పరుస్తున్నారని పేర్కొన్నారు.

భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ కుప్పకూలి పోయిందంటూ విదేశీ గడ్డపై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, మీ కుటుంబం పాలించే రాజరిక వ్యవస్థ కాదన్నారు. మీ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయాలు ఇవ్వడానికి రాజ్యాంగ సంస్థలు మీ జేబు సంస్థలు కావు, అధికారులు మీ వ్యక్తిగత సేవకులు కారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు