తెలంగాణలో తెర పైకి బీసీ సీఎం!

08-10-2026 | 05:10am

డాక్టర్ తిరునహరి శేషు :

ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ(Separate State of Telangana) ప్రజల ఆకాంక్ష. రాజ్యాధికారం(State Power), ముఖ్యమంత్రి పదవి అనేది బలహీన వర్గాల ద శాబ్దాల కల. 1956 సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుండి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష సాకారమవ్వటానికి ఆరు దశాబ్దలు పోరా టం చేయాల్సి వచ్చింది. కానీ ఏడు దశాబ్దాల తెలుగు రాష్ట్రాల(Telugu states) రాజకీయ చరిత్రలో బలహీనవర్గాలకు రాజకీయ అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 1969 లో తెలంగాణ ఉద్యమం(Telangana Movement) సృష్టించిన రాజకీయ ప్రకంపనల తరువాత బీసీకి సీఎం పదవి దక్కే అవకాశం తృటిలో తప్పిపోయింది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్ర దేశ్ ప్రాంతీయ పార్టీల రాజకీయ చట్రంలో బందీ అయిపోయింది.

కానీ తెలంగా ణ రాష్ట్రంలో జాతీయ పార్టీల రాజకీయ ప్రభావంతో సామాజిక న్యాయం(Social Justice), రాజ్యాధికారం అనే అజెండా బలంగా వినపడు తున్న క్రమంలో మునుపెన్నడూ లేనంతగా బలహీనవర్గాలు, వారి ఆకాంక్షలు, స మస్యలు, సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర రాజకీయాలలో ప్రభావిత అంశాలుగా మారి పోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సం దర్భంగా బిజెపి తెరపైకి తెచ్చిన బీసీ ము ఖ్యమంత్రి అనే అంశం ఒక రాజకీయ నినాదంగా కాకుండా అది మెజార్టీ ప్రజల బల మైన ఆకాంక్షగా లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నట్లుగానే కనిపిస్తున్నది.

దశాబ్దాల అణిచివేత

ఏడు దశాబ్దాలుగా రెండు రాష్ట్రాలలో మెజార్టీ బలంగా ఉన్న బలహీనవర్గా లకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదం టే రాజకీయ అణిచివేత ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ భార తంలో తమిళనాడు, కేరళ, కర్ణాటకలో బలహీనవర్గాల నుండి అన్నా దురై, కరుణా నిధి, స్టాలిన్, పినరయ్ విజయన్, అచ్యుతానందన్, సిద్ధరామయ్య, కుమారస్వామి లాంటి బలమైన నేతలు సీఎం పీఠాలను అధిష్టించగలిగారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ములాయం సింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మోహ న్ యాదవ్, బిందెశ్వర ప్రసాద్ మండల్, కర్పూరి ఠాకూర్, నితీశ్ కుమార్, అశోక్ గెహ్లాట్ లాంటి ఓబీసీ నాయకులు ముఖ్యమంత్రులు కాగలిగారు.

కానీ, తెలుగు రా ష్ట్రాలకు మాత్రం బిసి ముఖ్యమంత్రి అనే ఆకాంక్ష సుదూరమైన స్వప్నంగానే మిగిలిపోయింది. సమైక్యాంధ్రప్రదేశ్‌ను 16 మం ది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలిస్తే మొత్తం 18మంది సీఎంలలో ఒక్క దామోదర సంజీవయ్య తప్ప 17 మంది అగ్రవర్ణాలకు చెందిన వారే. వీరిలో రాజకీయంగా బలమైన సా మాజిక వర్గం నుండి తొమ్మిది మంది, మరొక రెండు సామాజిక వర్గాల నుండి ఐదుగురు.. అంటే మొత్తం ఈ మూడు సామా జిక వర్గాల నుండే 14 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ  అధికారాన్ని ఏడు దశాబ్దాలుగా మూడు సామా జిక వర్గాలే వంతులవారీగా తమ గుప్పెట్లో పెట్టుకున్నాయంటే సహజ సామాజిక న్యా యానికి విరుద్ధంగానే రాజకీయం పరిభ్రమించిందనే చెప్పాలి.

కొనసాగిన వివక్ష..      

బలహీనవర్గాలు సీఎం పదవికే కాదు ఉపముఖ్యమంత్రి పదవికి కూడా పనికిరా రు అనే అభిప్రాయాన్ని కలిగించారు. 1982లో కొద్దికాలానికి మాత్రమే సి.జగన్నాధరావు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మంత్రివర్గ కూర్పులో కూడా బలహీన వర్గాలకు సరై న ప్రాతినిధ్యం దక్కలేదు. కేసీఆర్ మంత్రివర్గంలో ముగ్గురికి, రేవంత్ రెడ్డి మంత్రివ ర్గంలో ఇద్దరికీ మాత్రమే మంత్రులుగా అ వకాశం దక్కింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో బలహీన వర్గాలకు 10 మంత్రి పద వులను కేటాయించారు.

తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ విద్యా, ఉద్యో గ, రాజకీయ అధికారంలో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారంగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీలకు ఏడు మంత్రి పదవులు కేటాయించాలి. రిజర్వేషన్ల అమలుకు చట్టాలు, కోర్టులు అడ్డుప డుతున్నాయని చెబుతున్న వారు మరి మంత్రి పదవులు కేటాయించటానికి ఏ చట్టాలు అడ్డుపడ్డాయో వారే బలహీన వ ర్గాల ప్రజలకు జవాబు చెప్పాలి.

చట్టసభలలో బలహీనవర్గాలకు రిజర్వేషన్లు లేకపో వడం వలన రాష్ట్ర శాసనసభలో 16 శాతం (20), లోక్ సభ లో 25.4 శాతం (138) మాత్రమే బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం దక్కింది. రిజర్వేషన్లు ఉన్న స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుండి 17 శాతానికి తగ్గిపోవడం వలన రాజ్యాధికారం అందకపోగా రాజ్యాధికారంలో గౌర వప్రదమైన వాటా కూడా  దక్కకపోవడం తో బీసీలు అణిచివేతకు గురయ్యారు.

మండల్ నుండి కామారెడ్డి వరకు

8 దశాబ్దల స్వతంత్ర భారతావనిని 14 మంది ప్రధానమంత్రులు పరిపా లిస్తే 1996లో కొద్ది కాలానికి మాత్రమే బలహీనవర్గాలకు చెందిన దేవెగౌడకు పీఎంగా పనిచేసే అవకాశం దక్కింది. కేం ద్రంలోనూ, మన రాష్ట్రంలోనూ బీసీలు అధికారంలోకి రాకపోవడం వలన ప్రభుత్వాల అభివృద్ధి అజెండాలో బీసీలకు సరై న ప్రాధాన్యత దక్కలేదు. దేశంలో నాలుగు దశాబ్దాలకు పైగా మండల్ కమిషన్ సిఫారసులు పూర్తిగా ఎందుకు అమలు కాలే దు? తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోని ఏ ఒక్క హామీని ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బలహీన వర్గా ల అభివృద్ధి సంక్షేమం పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరిని బయటపెడుతుంది.

కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బలహీనవర్గాల పట్ల కుడి ఎడమల దగానే అనేది దశాబ్దాలుగా నిరూపితమవుతున్న నగ్నసత్యం. జనగణనలో భాగంగా కులగణన చేయాలి, మండల్ కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్టులను అమలు చేయాలి. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ఓబీసీలకు ప్ర త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే బలహీన వర్గాల డిమాండ్ల పట్ల ప్రభు త్వా లు సానుకూలంగా స్పందించటం లే దు.. కాబట్టే మెజార్టీ వర్గాలకు రాజకీయ అధికారం దక్కాలనే ఆకాంక్ష బలపడుతుంది.

బీసీ ముఖ్యమంత్రి అవుతారా! 

అధికారంలోకి రాలేని కులాలు, వర్గా లు తమ హక్కులను కాపాడుకోలేవు.. కాబట్టి అవి అంతరించిపోతాయని రా జ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు తెలంగాణలో గత కొంతకాలంగా జైతెలంగాణ నినాదంలాగా రాష్ట్రాని కి ‘బీసీ ముఖ్యమంత్రి‘ కావాలనే బలమైన ఆకాంక్ష బలహీనవర్గాల నుండి వ్యక్తమవుతున్నది. బీసీ ముఖ్యమంత్రి కావాలనేది ఒక నినాదంగా కాకుండా ఒక బలమైన ఆకాంక్షగా తెరపైకి వస్తున్న నేపథ్యంలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి.

కానీ కులగణన చేస్తామనే హామీ ఇచ్చి మాట తప్పిన బిజెపిని, రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా బీసీలకు ఇవ్వని బిజెపిని ఎలా నమ్మాలి! 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని బహిరంగంగానే రేవంత్‌రెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యం లో కాంగ్రెస్‌ను ఎలా నమ్మాలి! అని బలహీనవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంతో తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేస్తుండటం ఆ పాదయాత్రకు బలహీన వర్గాల నుండి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో, కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కూడా సామాజిక న్యాయ అజెండాతో బీసీలకు అధికారంలో సముచితమై న వాటా దక్కాలని బలంగా మాట్లాడుతు న్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలలో బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక గేమ్‌చేంజర్‌గా మార బోతుంది.

ప్రస్తుత శాసనసభ లో మూడు అగ్రవర్ణ కులాలు కలిసి ప్రభు త్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యా బలం (61) కలిగి ఉంటే 134 కులాలు 56 శాతం జనాభా ఉన్న బలహీనవర్గాలు రాజ్యాధికారాన్ని ఎందుకు సాధించలేవు! అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. బీపీ మండల్ చెప్పినట్లు వెనుకబాటుతనంపై పోరాటం అనేది బలహీనవర్గాల మెదళ్ల నుండి ప్రారంభం కావాలి.. ఆ పోరాటం రాజ్యాధికారం అనే లక్ష్యాన్ని చేరాలని ఆశిద్దాం.

 వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, 9885465877

మరిన్ని వార్తలు