అరుదైన మానవతావాది బాల గోపాల్

08-10-2026 | 05:05am

నేడు బాలగోపాల్ వర్ధంతి :

సమాజంలో అట్టడుగునపడి నలిగిపోతున్న ఆర్తుల వేదనకు ఆర్తితో స్పందించి, రాజ్యహింసకు(State Violence) ఎదురొడ్డి నిలిచిన అరుదైన ప్రజాస్వామిక దీపస్తంభం డాక్టర్ కందాళ్ళ బాలగోపాల్(Dr. Kandalla Balagopal.). అక్టోబర్ 8వ తేదీ తెలుగు సమాజం తన మనస్సాక్షిని తానే తడుముకునే విషాదదినం.. సరి గ్గా 2009 అక్టోబర్ 8న రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో ఆ యన గుండె ఆగిపోయిన క్షణాన పౌరహక్కుల ఉద్యమం(Civil Rights Movement) తన అత్యంత వివేకవంత మైన స్వరకల్పనను కోల్పోయింది. కర్ణాటకలోని బళ్ళారిలో 1952 జూన్ 10న కం దాళ్ళ పార్థనాథ శర్మ, రాళ్ళపల్లి నాగమణి దంపతులకు ఐదవ సంతానంగా బాలగోపాల్ జన్మించారు.

తిరుపతిలోని శ్రీవేంక  టేశ్వర ప్రాచ్య, ఆరట్స్ కళాశాలల్లో డిగ్రీ పూర్తిచేసిన బాలగోపాల్, గణితశాస్త్రంలో అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించి వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (నేటి నిట్) నుంచి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. సంఖ్యాశాస్త్రపు సంక్లిష్ట సూత్రా లను అవలీలగా విడమరచి బోధించే అద్భుత ప్రజ్ఞతో 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర అధ్యాపకుడి గా చేరిన ఆయన, కేవలం తరగతి గదులకే పరిమితం కాలేదు.

బయట సమాజంలో నిరుపేదలు, గిరిజనులు, అణగారిన ప్రజ లు అనుభవిస్తున్న తీవ్ర అన్యాయాలు, పోలీసు నిర్బంధాలు, భూస్వామ్య దోపిడీ ఆయనలోని సామాజిక చైతన్యాన్ని రగిలించాయి. ఫలితంగా 1985లో గంభీరమైన విశ్వవిద్యాలయ ఆచార్య పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి, జీవితాంతం పౌరహక్కుల రక్షణకే ప్రాణాలను పణంగా పెట్టే కఠినమైన ప్రజాక్షేత్రంలోకి దూకారు. నిరాడంబరమైన ఖద్దరు లాల్చీ, భుజాన జోలె సంచీ, పాదచారిగా వేలాది మైళ్లు నడక.. ఇదీ బాలగోపాల్ రూపం.

హైదరాబాద్ గుడిమల్కాపూర్ ప్రియాకాలనీలోని చిన్న ఇంటిలో ఆయన గడిపిన నిరాడంబర జీవితం ఉద్యమకారులందరికీ నిత్య ఆదర్శం. ఆయన భార్య వసంతలక్ష్మి ‘ఆంధ్రజ్యోతి’లో బాధ్యతాయుతమైన పాత్రికే యురాలిగా పనిచేస్తూ ఆయన పోరాటాలకు వెన్నుదన్నుగా నిలవగా, వారి కుమా రుడు ప్రభాత తమ తల్లిదండ్రుల ఆశయాల వెలుగులోనే పెరిగి పెద్దయ్యాడు.

బాలగోపాల్ ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్సీ)లో 1983 నుం చి 1997 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో నెత్తురోడిన అధ్యాయం. బూటకపు ఎన్‌కౌంటర్లు, అక్రమ నిర్బంధాలు, గ్రామాలపై పోలీసు క్యాంపుల దాడులు నిత్యకృ త్యమైన ఆ రోజుల్లో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా తొలుత చేరుకునేది బాలగోపాల్ నేతృత్వంలోని నిజనిర్ధారణ బృందమే. చట్టబద్ధమైన పాలన చేయాల్సిన రాజ్యాం గ యంత్రాంగమే చట్టాన్ని ఉల్లంఘించి పౌరుల జీవించే హక్కును కాలరాస్తుంటే, రాజ్యం చేస్తున్నది హత్యలేనని పత్రాల సాక్షిగా ప్రపంచానికి చాటిచెప్పారు.

ఆయన సాహసానికి ప్రతిగా రాజ్యం ఆయనపై తీవ్రమైన కక్ష పెంచుకుంది. ‘నక్సలైట్ సానుభూతిపరుడు’గా ముద్రవేసి వేధించింది. ఒకానొక సందర్భంలో కొత్తగూడెం అటవీ ప్రాంతంలో నిజనిర్ధారణ కోసం వెళ్ళిన బాలగోపాల్‌పై గుర్తుతెలియని దుం డగులు, మఫ్టీ పోలీసు గూండాలు.. రాళ్ళు, కర్రలతో దాడి చేసి,చనిపోయాడని భావిం చి మురికి కాలువలో పారేసి వెళ్ళారు. అదృష్టవశాత్తూ పీడీఎస్‌యూ విద్యార్థి కార్యకర్తలు ఆయన్ను సకాలంలో గుర్తించి రక్షించడంతో ప్రాణాలు దక్కాయి.

శరీరం రక్తసిక్తమైనా, ఎముకలు విరిగినా ఆయన గొంతు మరింత రాటుదేలిందే తప్ప బెదరలేదు. 1980 చివరలో నక్సలైట్లు పోలీసు అధికారులను బందీలుగా పట్టుకున్నప్పుడు, పోలీసు వర్గాల అండదండలతో పుట్టుకొచ్చిన ప్రైవేటుముఠా ‘ప్రజాబంధు’ బాలగోపాల్‌ను కిడ్నాప్ చేసి తమ పోలీసు అధికారులను విడిపించేదాకా బందీగా ఉంచిన ఘోర సంఘటన ఆయన పోరాట తీవ్రతకు దర్పణం పడుతుంది.

న్యాయవ్యవస్థ ద్వారానే రాజ్య అరాచకత్వాన్ని నియంత్రించగలమని గుర్తించిన ఆయన నలభై ఏళ్ళ వయసులో న్యాయశాస్త్రం (ఎల్‌ఎల్‌బి) అభ్యసించి న్యాయవా దిగా మారారు. బూటకపు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసులు నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానాల్లో ఆయన సాగించి న పోరాటం భారత న్యాయచరిత్రలోనే మైలురాయిగా నిలిచింది.

ఆయన కార్యక్షేత్రం ఆంధ్రదేశానికే పరిమితం కాలేదు. గుజరా త్ నరమేధం మొదలు, కాశ్మీర్ లోయలో ని అదృశ్యాలు, పశ్చిమబెంగాల్‌లోని లాల్‌గఢ్ ఉద్యమం, ఒరిస్సాలోని రాయగడ, కళింగనగర్ గిరిజనుల భూపోరాటాలు, నర్మదా బచావో ఆందోళన దాకా ఎక్కడ మానవ హక్కులు కాలరాయబడినా బాలగోపాల్ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు.

బాలగోపాల్ కేవలం ఒక ఉద్యమకారు డు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అరుదైన సామాజిక శాస్త్ర వేత్త, మార్క్సిస్ట్ తాత్వికుడు. ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ (ఈపీడబ్ల్యూ) పత్రికలో ఆయన మూడు దశాబ్దాలపాటు రాసిన వందలాది వ్యాసాలు భారతీయ గ్రామీణ ఆర్థిక ముఖచిత్రాన్ని, వర్గ-కుల సంక్లిష్టతలను అత్యంత లోతుగా ఆవిష్కరించాయి. 90ల తొలినాళ్ళలో సోవియట్ యూనియన్ పతనం కావడం, కారంచేడు, చుండూరు వంటి దళిత ఊచకోతలు జరగడం ఆయన ఆలోచనా విధానంలో తీవ్ర మైన మథనాన్ని తెచ్చాయి. కేవలం వర్గదృక్పథంతో మాత్రమే భారతీయ సమాజం లోని కులపీడనను అర్థం చేసుకోలేమని గ్రహించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మార్క్సిజంతో జోడించి సరికొత్త విశ్లేషణను ముందుకు తెచ్చారు. 

ఈ తాత్విక పరిణామక్రమంలోనే ఆయ న విప్లవపార్టీల ‘సాధ్య-సాధ్యాల’ వైరుధ్యా న్ని నిలదీశారు. రాజ్యం చేసే హింస ఎంత తప్పో, విప్లవం పేరుతో పీపుల్స్‌వార్, మా వోయిస్టులు సాగించే వ్యక్తిగత హత్యలు, ప్రజాకోర్టుల పేరిట చేసే శిక్షలు, ఇన్‌ఫార్మర్ల నెపంతో సామాన్యులను చంపడం కూడా అంతే తప్పని నిర్భయంగా ప్రకటించారు. ఈ మౌలిక సిద్ధాంత విభేదాల ఫలితంగానే 1998లో ఏపీసీఎల్సీ నుంచి బయటకు వచ్చి ‘మానవ హ క్కుల వేదిక’ (హ్యూమన్ రైట్స్ ఫోరం -- హెచ్‌ఆర్‌ఎఫ్) ను స్థాపించారు.

ఆయన రాసిన ‘నక్సల్బరీ ఉద్యమం: గమనం-గమ్యం’, ‘చీకటి కోణా లు’ వంటి రచనలు విప్లవోద్యమ శ్రేణుల్లో తీవ్ర చర్చను, ఆగ్రహాన్ని రేకెత్తించాయి. లాల్‌గఢ్ హింసను నిరసించినప్పుడు మా వోయిస్టు అగ్రనేత కిషన్‌జీ (మల్లోజుల కోటేశ్వరరావు) వంటి వారు ఆయనపై బహిరంగ విమర్శలు గుప్పించినా, బాలగోపాల్ ఏనాడూ తన వైఖరిని వీడలేదు. 2008లో కేంద్రప్రణాళికా సంఘం మా వోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి సవాళ్ళపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా పనిచేస్తూ, అణచివేతతో ధోరణి కాకుండా, గిరిజనుల జల్-.. జంగిల్..జమీన్ హక్కులను కాపాడినప్పుడే శాంతి సాధ్యమని పాలకులకు హితవు పలి కారు.

ఆంధ్రదేశంలో బాలగోపాల్ నడవని పల్లె లేదు, చూడని కొండకోన లేదు. ప్రాజెక్టుల నిర్వాసితుల కన్నీటి నుంచి ఎన్‌కౌంటర్ మృతుల తల్లుల రోదనల దాకా తన కలాన్ని, గళాన్ని అంకితం చేసిన నిఖార్సయిన కర్మయోగి ఆయన. 57 ఏళ్ళ చిన్న వయస్సులోనే ఆయన భౌతికంగా నిష్క్రమించినా, ఆయన నిష్పాక్షిక పౌరహక్కుల తాత్వికత నేటికీ, ఏనాటికీ ప్రజాస్వామ్య ప్రియులకు మార్గదర్శకమై వెలుగొందుతూనే ఉంటుంది.

రామకిష్టయ్య సంగనభట్ల

 వ్యాసకర్త: సీనియర్ 

ఇండిపెండెంట్ జర్నలిస్ట్,

కాలమిస్ట్, 9440595494

మరిన్ని వార్తలు