భూ హక్కుల భద్రతకు కొత్త దారి
డీడ్ రిజిస్ట్రేషన్ నుంచి టైటిల్ డీడ్ వరకు అవసరం, ప్రయోజనాలు, సంస్కరణలు--విశ్లేషణ ౩
టీ చిరంజీవులు :
గత రెండు వ్యాసాలలో 1. నైజాం కాలం(Nizam Era) నుంచి నేటివరకు తెలంగాణలో(Telangana) భూ స్వామ్య విధానం, సంస్కరణలు, 2. భూమి రికార్డుల పరిణామక్రమం గూర్చి చర్చించాం. ఇందులో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో(Registration System) జరగాల్సిన సంస్కరణలు, టైటిల్ రిజిస్ట్రేషన్ గూర్చి చర్చిద్దాం.
భారత్‌లో భూమి కొనుగోలు, అమ్మకం, వారసత్వం, విభజన, బహుమతి వంటి లావాదేవీలలో రిజిస్ట్రేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యముంది. అయినప్పటికీ, ఒక భూమిని కొనుగోలు చేసి, దాని సేల్ డీడ్‌ను(Sale Deed) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో(Sub-Registrar Office) రిజిస్టర్ చేయించుకున్నంత మాత్రాన కొనుగోలుదారుడికి ఆ భూమిపై తిరుగులేని యాజమాన్య హక్కు లభిస్తుందని చెప్పలేం. ఇదే దేశంలోని ప్రస్తుత డీడ్ రిజిస్ట్రేషన్ విధానంలో ప్రధానమైన లోపం.
తగినంత శ్రద్ధ వహించటం : భూమిని కొనుగోలు చేసే వ్యక్తి గత యాజమాన్య పత్రాలను పరిశీలించాలి. భూమిపై కోర్టు వివాదాలున్నాయా, తనఖాలో ఉందా, వారసుల హక్కులున్నాయా, ప్రభుత్వ పరిమితులేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా భవిష్యత్తులో మరో వ్యక్తి యాజమాన్యాన్ని సవాల్ చేసే అవకాశముంటుంది. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో అమలులో ఉన్న టైటిల్ రిజిస్ట్రేష న్ విధానాన్ని భారత్‌లోనూ ప్రవేశపెట్టడం.
1. బ్రిటిష్ పాలనలో మార్పులు :
బ్రిటిష్ పాలనకు ముందు భారత్‌లో భూమిపై హక్కులు ఒకేవిధంగా ఉండేవి కావు. రాజులు, స్థానిక పాలకులు, గ్రామ సమాజాలు, సాగుదారులు, జమీందారు లు తదితరులకు ప్రాంతాన్నిబట్టి భిన్నమైన హక్కులుండేవి. కానీ భూమి అనేది కొనే, అమ్మే సరుకు కాదు, కేవలం వారసత్వంగా సంక్రమించే సాధనం. అయితే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిని ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన వనరుగా పరిగణించి, భూమి హక్కులను చట్టబద్ధమైన ఆస్తి హక్కులుగా పునర్వ్యవస్థీకరించింది.
1793లో లార్డ్ కారన్వాలిస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమి శిస్తు విధానం ( పర్మినెంట్ సెటిల్మెంట్) బెంగాల్ ప్రాంతంలో భూ ఆదాయ వ్యవస్థకు కీలకమైన మార్పు తీసుకొచ్చింది. జమీందారులకు భూ ఆదాయ చెల్లింపుల బాధ్యతతోపాటు విస్తృతమైన యాజమాన్య హక్కులను గుర్తించారు. నిర్దిష్ట గడువులో ప్రభుత్వ ఆదాయం చెల్లించకపోతే జమీందారి ఎస్టేట్లను వేలం వేసే విధానం అమల్లోకి వచ్చింది. దీనితో రైతుల హక్కులపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే, ఈ వ్యవస్థ దేశమంతటా ఒకేలా అమలుకాలేదు.
మద్రాస్, బొంబాయి ప్రాం తాల్లో రైతు వారి విధానం, ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మహల్వారీ విధా నం వంటి ఇతర భూ ఆదాయ వ్యవస్థలు కూడా అమల్లోకొచ్చాయి. ఈ చారిత్రక మార్పుల ప్రాధాన్యమేంటంటే, భూ హక్కులను ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన పత్రాలు, న్యాయస్థానాల ద్వారా గుర్తించే వ్యవస్థ క్రమంగా బలపడింది. కానీ నేడు దేశంలో భూ హక్కులను నిర్ధారించే విషయంలో ఇప్పటికీ అనేక రికార్డులు, పత్రాలు, పరిపాలనా వ్యవస్థలు పరస్పరం పూర్తిగా అనుసంధానమై లేవు. (నిజాం స్టేట్‌లో భూమి హక్కుల స్వరూ పం గూర్చి మొదటి ఆర్టికల్‌లో చదివాం)
2. డీడ్ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి?
భారత్‌లో ప్రధానంగా అమలులో ఉన్నది డాక్యుమెంట్ లేదా డీడ్ రిజిస్ట్రేషన్ విధానం. రిజిస్ట్రేషన్ చట్టం, 1908 ప్రకారం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అవసరమైన ఆస్తి లావాదేవీల పత్రాలను సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేస్తారు. ఉదాహరణకు, రామయ్య తన భూమిని కృష్ణయ్యకు అమ్మినాడనుకుందాం. కృష్ణయ్య సేల్ డీడ్‌ను రిజిస్టర్ చేయిస్తాడు. ఇందులో ప్రధానంగా నమోయ్యేది రామయ్య నుంచి కృష్ణయ్యకు భూమి బదిలీ చేస్తున్నట్లు తెలిపే పత్రం.
కానీ, రిజిస్ట్రేషన్ అధికారి ఆ భూమిపై రామయ్యకు నిజంగా సంపూర్ణ యాజమాన్య హక్కు ఉందా, గతంలో మరొకరికి విక్రయించాడా, వారసుల హక్కులున్నాయా వంటి అంశాలన్నింటినీ సమగ్రంగా విచారించి తుది యాజమాన్య ధ్రువీకరణ ఇవ్వడం ప్రస్తుత విధానంలో సాధారణంగా జరగదు. అందువల్ల రిజిస్టరైన పత్రం లావాదేవీకి ముఖ్యమైన సాక్ష్యమే అయినప్పటికీ, అదొక్కటే తిరుగులేని యాజమాన్య రుజువు కాదు. విక్రేతకు ఉన్న దానికంటే ఎక్కువ హక్కును కొనుగోలుదారుడు పొందలేడు.
3. టైటిల్ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి?
టైటిల్ రిజిస్ట్రేషన్‌లో ప్రధానంగా నమోదు చేసేది కేవలం ఆస్తి బదిలీ పత్రాన్ని మాత్రమే కాదు.. ఆ ఆస్తిపై చట్టబద్ధమైన యాజమాన్య హక్కును కూడా. ఈ విధానంలో ప్రభుత్వం లేదా చట్టం ద్వారా అధికారం పొందిన సంస్థ భూమి హక్కులను పరిశీలించి, సంబంధిత భూమికి యజమాని ఎవరు, భూ విస్తీర్ణం ఎంత, సరిహద్దులేంటి, తనఖాలు లేదా ఇతర పరిమితులున్నాయా అనే అంశాలను సమగ్రంగా నమోదు చేస్తుంది. దీని కోసం పాత యాజమాన్య పత్రాలు, సర్వే.. రెవెన్యూ రికార్డులు, వారసత్వ హక్కులు, కోర్టు ఉత్తర్వులు, ఇతర హక్కుదారుల అభ్యంతరాలు వంటి అంశాలను పరిశీలించాలి. అభ్యంతరాలుంటే పరిష్కరించేందుకు తగిన ప్రక్రియ ఉండాలి.
అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తరువాత నమోదు చేసిన టైటిల్‌కు చట్టం నిర్దేశించిన మేరకు తుది లేదా నిర్ణయాత్మక హోదా కల్పిస్తారు. ఆ టైటిల్లో తప్పిదం వల్ల ఎవరికైనా నష్టం కలిగితే పరిహారం పొందే వ్యవస్థ కూడా ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా టోరెన్స్ సిస్టమ్ వంటి టైటిల్ రిజిస్ట్రేషన్ నమూనాలు ఈ సూత్రానికి ఉదాహరణలు. అయితే ప్రతి దేశంలో వాటి నియమాలు, ప్రభుత్వ హామీ పరిధి ఒకేలా ఉండవు.
ఈ పట్టికలో టైటిల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రయోజనాలు, సమర్థవంతమైన చట్టాలు, నమ్మదగిన రికార్డులు, వివాద పరిష్కార వ్యవస్థ ఉన్నప్పుడే పూర్తిగా సాధ్యమవుతాయి. భారత్‌లో రాష్ట్రాన్ని బట్టి సుమారు 4శాతం నుంచి 11శాతం వరకు స్టాంప్‌డ్యూటీ చెల్లిస్తున్నప్పటికీ, కొనుగోలు చేసిన భూమి/ఆస్తి టైటిల్లో లోపం తేలితే కొనుగోలుదారుడికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం లభించే వ్యవస్థ లేదు. మరి ఎందుకింత పెద్ద ఎత్తున , స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలనే ప్రశ్న ఉద్భవిస్తుంది.

5. టైటిల్ డీడ్‌లో 4 కీలక సూత్రాలు
1. ప్రతిబింబ సూత్రం (మిర్రర్ ప్రిన్సిపల్) : భూమికి సంబంధించిన అధికారిక రిజిస్టర్ ఆ భూమి యాజమాన్యం, విస్తీర్ణం, సరిహద్దులు, తనఖాలు, ఇతర చట్టబద్ధమైన హక్కులు, పరిమితులను కిచ్చితంగా ప్రతిబింబించాలి. 2. తెర సూత్రం (కర్టెన్ ప్రిన్సిపల్) : కొనుగోలుదారుడు ప్రస్తుత అధికారిక టైటిల్ రిజిస్టర్ ఆధారంగా హక్కులను నిర్ధారించుకోగలగాలి. ప్రతిసారీ గతంలోని అన్ని లావాదేవీల పత్రాలను పరిశీలించాల్సిన అవసరం లేదు.
3. పరిహార సూత్రం - (ఇన్సూరెన్స్/ఇండెమ్నిటీ ప్రిన్సిపల్) : ప్రభుత్వ రిజిస్టర్లో పొరపాటు, మోసం లేదా పరిపాలనా తప్పిదం కారణంగా, చట్టం నిర్దేశించిన పరిస్థితుల్లో నిర్దోషి వ్యక్తికి నష్టం కలిగితే, పరిహార నిధి ద్వారా నష్టపరిహారం అందించాలి. 4. టైటిల్‌కు చట్టబద్ధమైన తుది రక్షణ (ఇన్డెఫిసియెబిలిటీ ఆఫ్ టైటిల్) : రిజిస్టర్లో చట్టబద్ధంగా నమోదు చేసిన యాజమాన్య హక్కుకు చట్టం నిర్దేశించిన మేరకు బలమైన రక్షణ ఉండాలి. సంప్రదాయ టోరెన్స్ సిస్టమ్‌లో మొదటి మూడు సూత్రాలనే సాధారణంగా ప్రధాన సూత్రాలుగా పేర్కొంటారు. నాలుగోది ఆ వ్యవస్థ లక్ష్యాలలో ఒకటైన టైటిల్ యొక్క చట్టబద్ధమైన తుది రక్షణను సూచిస్తుంది.
6. భారత్‌లో టైటిల్ డీడ్ ఎందుకు?
భూమికి సంబంధించిన వివాదాలు భారత న్యాయవ్యవస్థపై గణనీయమైన భారాన్ని మోపుతున్నాయి. పాత సేల్ డీడ్లు, అసంపూర్ణ సర్వేలు, ఒకే భూమికి సంబంధించి వేర్వేరు రికార్డులు, వారసత్వ సమస్యలు, నకిలీ పత్రాలు, ఒకే ఆస్తిని పలుమార్లు విక్రయించడం వంటి సమస్యలు ఇందుకు కారణాలు. భూమిని కొనుగోలు చేసే వ్యక్తి అనేక సంవత్సరాల పత్రాలను పరిశీలించాల్సి వస్తోంది. న్యాయవాదుల సేవలు, పత్రాల శోధన, సర్వే, ధ్రువీకరణ కోసం సమయం, డబ్బు ఖర్చవుతున్నాయి. అయినప్పటికీ పూర్తి భద్రతకు హామీ ఉండటం లేదు.
భారత ప్రభుత్వం 2008లో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) ను ప్రారంభించి, భూమి రికార్డుల ఆధునికీకరణతోపాటు, అంతిమ లక్ష్యంగా టైటిల్ గ్యారంటీ సిస్టమ్ (భూమి యాజమాన్య హక్కులకు చట్టబద్ధమైన హామీ కల్పించే వ్యవస్థ) ఏర్పాటును నిర్దేశించింది. అనంతరం 2013లో కూడా ఈ దిశగా ఒక కమిటీని నియమించింది. అయినప్పటికీ, భూ యాజమాన్య హక్కులకు చట్టబద్ధమైన హామీ కల్పించే వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే దిశలో ఇప్పటివరకు సాధించిన పురోగతి చాలా పరిమితంగానే ఉందని చెప్పవచ్చు
7. భారత్‌లో టైటిల్ డీడ్ ఎలా?
-ప్రస్తుతం దేశంలో భూమి సమాచారం ప్రధానంగా నాలుగు శాఖల్లో విస్తరించి ఉంది. రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయి సమాచారం: భూమి సాగు, అనుభవం, పట్టాదారు వివరాలు, పంటలు, భూ వినియోగం వంటి రికార్డులను నిర్వహిస్తుంది. అయితే రెవెన్యూ రికార్డులో పేరు ఉండటం ఒక్కటే అంతిమ యాజమాన్యానికి రుజువు కాదు. సర్వే శాఖ - భౌగోళిక సమాచారం : భూమి విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్లు, ఉపవిభాగాలు, మ్యాపులను నిర్వహిస్తుంది. ఇది భూమి ఎక్కడ ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది అనే విషయాలను నిర్ధారించడంలో కీలకం.
రిజిస్ట్రేషన్ శాఖ -డాక్యుమెంటరీ సమాచారం: భూమి కొనుగోలు, అమ్మకం, బహుమతి, విభజన, తనఖాలకు సంబంధించిన నమోదు చేసిన పత్రాలను నిర్వహిస్తుంది. స్థానిక సంస్థలు పంచాయతీ, మున్సిపాలిటీలు ఇంటి ఆస్థి యజమాన్య వివరాలు నిర్వహిస్తున్నాయి. అంటే ఒక శాఖ క్షేత్రస్థాయి సమాచారం, మరొకటి భౌగోళిక సమాచారం, ఇంకొకటి లావాదేవీల పత్రాలను నిర్వహిస్తున్నాయి. నాలుగోది ఇంటి ఆస్థి యజమాన్య వివరాలు నిర్వహిస్తున్నాయి.
ఈ నాలుగు శాఖల రికార్డులను అనుసంధానించి, వాటిలోని వ్యత్యాసాలను పరిష్కరించకుండా సమర్థవంతమైన టైటిల్ రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. అందువల్ల శాఖలను తప్పనిసరిగా విలీనం చేయడం కంటే, వాటి బాధ్యతలను స్పష్టంగా ఉంచుతూ ఒకే సమగ్ర డిజిటల్ భూ రికార్డు వ్యవస్థను నిర్మించాలి. ఇది కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కంప్యూటరీకరించడం ద్వారా సాధ్యమయ్యే సంస్కరణ కాదు. చట్టపరమైన, సాంకేతిక, పరిపాలనా మార్పులు సమన్వయంతో చేపట్టాలి.
మొదటగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేయదగిన టైటిల్ రిజిస్ట్రేషన్ నమూనాను రూపొందించాలి. ఇప్పటికే భారత ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ చట్టాన్ని అన్ని రాష్ట్రాలకు అమలు చేయమని పంపింది. కొంత పని ఆంధ్రప్రదేశ్‌లో జరిగినప్పటికినీ,రాజకీయ కారణాలతో అది పక్కన పడింది. రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. అయితే, భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి చట్టాల రూపకల్పన, అమలు, స్టాంపు డ్యూటీ వసూలు వంటి విషయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు అధికారాలున్నాయి.
దేశంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను సంస్కరించాలంటే, కేంద్రం రూపొందించే చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా బాధ్యతలు, భూముల రికార్డుల నిర్వహణ.. ఈ మూడింటినీ సమన్వయం చేయడం అవసరం. రెండవది, దేశవ్యాప్తంగా భూ సమగ్ర సర్వే, రీ-సర్వే నిర్వహించి ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలి. భూమి మ్యాప్, విస్తీర్ణం, సరిహద్దులు, యాజమాన్య పత్రాలు, రెవెన్యూ వివరాలు, తనఖాలు, కోర్టు కేసుల వంటి సమాచారాన్ని ఒక సమగ్ర డిజిటల్ రికార్డులో అనుసంధానించాలి.
అందుకు నేడు అందిబాటు లో ఉన్న జీఎన్ఎస్ఎస్ ఆర్టీకే/నెట్వర్క్ ఆర్టీకే, డ్రోన్ ఫొటోగ్రామేత్రి, లిడార్, జీపీఆర్, జీఐఎస్+ఏఐ వంటి అధునాతన సాంకేతికతనూ ఉపయోగించవచ్చు. మూడవది, ప్రస్తుత రికార్డులను నేరుగా తుది టైటిల్‌గా ప్రకటించకూడదు. పాత హక్కుల పరిశీలన, ప్రజా నోటీసులు, అభ్యంతరాల స్వీకరణ, వారసుల హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారానికి తగిన అవకాశం కల్పించాలి. పెండింగ్‌లో ఉన్న భూముల విషయంలో ప్రత్యేక విధానం రూపొందించాలి.
నాలుగవది, టైటిల్ రిజిస్ట్రేషన్ నిర్వహించే ప్రత్యేక సంస్థలు లేదా అధికారులకు స్పష్టమైన చట్టబద్ధమైన బాధ్యతలు కల్పించాలి. తప్పు టైటిల్ నమోదు వల్ల నిర్దోషులకు నష్టం కలిగితే న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రత్యేక నిధి లేదా బీమా విధానాన్ని పరిశీలించాలి. ఐదవది, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ముందుగా ఎంపిక చేసిన జిల్లాలు లేదా మండలాల్లో పైలట్ ప్రాజెక్టులను అమలు చేసి, సమస్యలను పరిష్కరించిన తరువాత దశలవారీగా విస్తరించాలి.
ఇప్పటికే అమలులో ఉన్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం(డీఐఎల్ఆర్ఎంపీ) వంటి కార్యక్రమాలను ఈ లక్ష్యానికి అనుసంధానించవచ్చు. గతంలో నిజామాబాద్ జిల్లాలో భూభారతి ప్రాజెక్ట్ అమలు చేసిన అనుభవం ఉంది. అధునాతన బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగించి రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కంప్యూటరైజ్ చేసిన ఘనత తెలంగాణకుంది .అందుకుగాను 2020లో భారత్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీలో తెలంగాణ రాష్ట్రానికి బంగారు పథకం రావడం కూడా జరిగింది. వ్యాసకర్త ఆ అవార్డును అందుకున్నారు.
8. భారత్‌కు పాఠాలు-:
ఆస్ట్రేలియాలో టోరెన్స్ టైటిల్ రిజిస్ట్రేషన్ విధానం, న్యూజిలాండ్‌లో డిజిటల్ టైటిల్ నిర్వహణ, ఇంగ్లాండ్- వేల్స్లో హెచ్ఎం ల్యాండ్ రిజిస్ట్రీ వ్యవస్థ భూ హక్కుల నమోదు విషయంలో ముఖ్యమైన ఉదాహరణలు. అయితే దేశానికొక చట్టాలు, ప్రభుత్వ హామీలు, పరిహార నిబంధనలు భిన్నంగా ఉంటాయి. భారతదేశంలో డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం (డీఐఎల్ఆర్ఎంపీ), నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎన్జీడీఆర్ఎస్) వంటి కార్యక్రమాలను మరింత సమన్వయంతో అభివృద్ధి చేయాలి.
9. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్, బ్లాక్ చైన్ టెక్నాలజీ పాత్ర, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పాత పత్రాలను చదవడం, యాజమాన్య పరంపరను విశ్లేషించడం, పేర్లు, విస్తీర్ణాలు, సర్వే నంబర్లలో వ్యత్యాసాలను గుర్తించడం, అనుమానాస్పద లావాదేవీలను పరిశీలనకు పంపడం వంటి పనుల్లో సహాయపడుతుంది. డిజిటల్ మ్యాపింగ్, జీఐఎస్, ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ భూమి సరిహద్దులపై వ్యత్యాసాలను గుర్తించడంలో తోడ్పడతాయి.
డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ ద్వారా లావాదేవీల చరిత్రను సురక్షితంగా నమోదు చేసి, అనుమతి లేని మార్పులను గుర్తించవచ్చు. రికార్డులను టాంపరింగ్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించాలి. ఏఐ కూడా చట్టబద్ధమైన యాజమాన్య హక్కును స్వయంగా సృష్టించలేదు. అందువల్ల ముందుగా హక్కులను చట్టబద్ధంగా నిర్ధారించి, ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానంతో వాటి రికార్డులను భద్రపరచాలి.
10 ముగింపు : భూమి అనేది కేవలం కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వస్తువు మాత్రమే కాదు. అది రైతు జీవనాధారం, మధ్యతరగతి కుటుంబానికి జీవితకాలపు పొదుపు, పేద కుటుంబానికి ఆర్థిక భద్రత, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన వనరు.
అలాంటి భూమిపై హక్కును నిర్ధారించుకోవడానికి ప్రజలు దశాబ్దాల పాత పత్రాలను వెతుక్కుంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మారాలి. రిజిస్ట్రేషన్ అంటే కేవలం ఒక పత్రాన్ని నమోదు చేయడం మాత్రమే కాకుండా, చట్టబద్ధమైన యాజమాన్య హక్కుకు విశ్వసనీయ భద్రత కల్పించే వ్యవస్థగా అభివృద్ధి చెందాలి.
డీడ్ రిజిస్ట్రేషన్ నుంచి టైటిల్ రిజిస్ట్రేషన్ వైపు భారత్ క్రమబద్ధంగా అడుగులు వేయాలి. అయితే ఆ మార్పు భూమి హక్కులను ముందుగానే సమగ్రంగా పరిశీలించి, నిజమైన హక్కుదారులను రక్షించి, వివాదాలను న్యాయంగా పరిష్కరించి, తప్పిదాలకు పరిహారం కల్పించే పటిష్టమైన వ్యవస్థతో కూడి ఉండాలి. అప్పుడే భూమి కొనుగోలు ప్రజలకు భయానికి కారణం కాకుండా, భద్రతకు నిదర్శనంగా మారుతుంది.
విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ చైర్మన్