ఎల్ నినో వేళ ఏఐ డేటా సెంటర్లు వద్దు
ప్రజల తాగునీటి(Drinking water) అవసరాలకు, వ్యవసాయానికి(Agriculture), పర్యావరణ పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలగదని నిర్ధారించే వరకు, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్ల(AI data centers) ఏర్పాటు హామీలను నిలిపివేయాలి. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్న సమయంలో, ఇప్పటికే సమస్యగా ఉన్న నీరు, విద్యుత్ వనరులపై మరింత భారాన్ని పెంచే భారీ కంప్యూటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ఏమాత్రం ముందుచూపు లేని నిర్ణయం.
రానున్న నెలల్లో వ్యవసాయానికి నీరందించే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్వయం గా హెచ్చరించారు. తాగునీటిని కా పాడుకోవడానికి రైతులు(Farmers) ఒక పంట కాలాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. అంతేకాకుండా, ప్రజలకు తాగునీరు అందించడాన్ని సైతం హామీ ఇవ్వడం కష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయని హెచ్చరించారు. వ్యవసాయానికి నీరు అందించలేని, కనీసం ప్రజలకు తగినంత తాగునీటికి కూడా హామీ ఇవ్వలేని ప్రభుత్వం, అపారంగా నీటిని వినియోగించే భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లను రాష్ట్రానికి ఆహ్వానించడం తగదు.
తెలంగాణలో రైతులకు నీరు లేదు, ప్రజల అవసరాలకు సరిపడా నీరు లేదు, కానీ బడా సాంకేతిక సంస్థలకు మాత్రం సమృద్ధిగా నీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రాధాన్యతలను తలకిందులు చేసే ఈ చర్య , ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనాన్ని బయటపెడుతోంది.
భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లు సాధారణ పారిశ్రామిక సంస్థలు కావు. వీటిలో అపారమైన కంప్యూటింగ్ కార్యకలాపాలకు భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. విద్యుత్ మిగులు రాష్ట్రం కాని తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ఇప్పటికే ఒత్తిడి పెరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఈ కేంద్రాలకు భారీ మొత్తంలో విద్యుత్‌ను కేటాయించడం వల్ల ప్రస్తుత సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే పంట కోత సమయంలో రైతులు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నారు.
అయినప్పటికీ, 2029 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కేంద్రాలు నిరంతరం, 24 గంటలూ పనిచేస్తాయి. వీటికి రెండు విద్యుత్ గ్రిడ్ల నుంచి సరఫరా ఉంటుందని హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర రంగాల ఇంధన అవసరాలకు విఘాతం కలగకుండా ఈ అదనపు విద్యుత్ డిమాండ్‌ను ఎలా తీర్చగలదో ప్రభుత్వం వివరించాలి.
దేశీయ, అంతర్జాతీయ భారీ సాంకేతిక సంస్థల కంప్యూటింగ్ అవసరాల కోసం విలువైన భూమి, నీరు, విద్యుత్ వనరులను కేటాయించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. ఈ భారీ పెట్టుబడుల వల్ల ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చేస్తున్న గొప్ప ప్రకటనలను, ఇటువంటి అధిక మూలధనంతో ఏర్పాటయ్యే కేం ద్రాలు శాశ్వతంగా కల్పించే ఉద్యోగాల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుoది. అంతేకాకుండా, ఈ విధ్వంసకర భారీ ప్రాజెక్టుల పర్యావరణ వ్యయాన్ని చివరకు భరించాల్సింది ప్రజలే.
అరుదుగా లభించే నీటి వనరులను సమానత్వ ప్రాతిపదికన పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. రైతులు రానున్న కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ, తాగునీటిపై కూడా అనిశ్చితిని అంగీకరిస్తున్న ప్రభుత్వం, అత్యధిక వనరులను వినియోగించే పరిశ్రమలకు మాత్రం సాదర స్వాగతం పలకడం సమర్థనీయం కాదు. ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోంది? ఎవరి మూల్యంగా ఆ ప్రయోజనాలను నెరవేర్చాలనుకుంటోంది? అనే ప్రశ్నలను ఈ విధానం లేవనెత్తుతోంది.
బడా సాంకేతిక సంస్థల విస్తరణ ఆకాంక్షల కంటే ప్రజల ప్రాథమిక అవసరాలకే ప్రాధాన్యమివ్వాలి. నీటి కొరతతో సతమతమవుతున్న రాష్ట్రంలో, భారీ స్థాయి ఏఐ డేటా సెంటర్లను పర్యావరణానికి అనుకూలంగా ఎలా ఏర్పాటు చేయాలన్నది మాత్రమే ప్రశ్న కాదు. అసలు వాటిని ఏర్పాటు చేయడం సమంజసం కాదు. పెట్టుబడులు, సాంకేతిక రంగంలో ప్రతిష్ఠ వంటి అంశాలకు ప్రజల ప్రాథమిక అవసరాలు, స్థానిక పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు.
వీఎస్ కృష్ణ, ఎస్ జీవన్‌కుమార్, మానవ హక్కుల వేదిక,
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమన్వయ కమిటీ సభ్యులు