యూపీలో కులాల కురుక్షేత్రం!

28-10-2026 | 05:05am

వెంకగారి భూమయ్య :

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh).. దేశ రాజకీయాలకు దిక్సూచి. ఇక్కడి ఎన్నికల ఫలితాలు(Election Results) కేవలం ఆ రాష్ట్ర భవితవ్యాన్నే కాదు.. జాతీయ రాజకీయాల దిశదశను సైతం ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే 2027 అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రానికి ఇంకా తెర లేవకముందే రాజకీయ చదరంగం మొదలైంది. ఏ కులం ఎటువైపు? ఏ వర్గం ఓట్లు(Votes) ఎవరికి? ఏ అభ్యర్థితో ఎంత ప్రయోజనం? పార్టీల శిబిరాల్లో ఇప్పుడు ఇవే లెక్కలు! అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రజాస్వామ్య పండుగగా జరగాల్సిన ఎన్నికలు.. కులాల గణాంకాలు, అధికార పీఠం కోసం సాగే వ్యూహ ప్రతివ్యూహాలకే పరిమితమైతే ప్రజా సమస్యలకు చోటెక్కడ అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న! 

కులాల లెక్కలే కొలమానమా?

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కులం ఒక సామాజిక వాస్తవం మాత్రమే కాదు.. దశాబ్దాలుగా ఎన్నికల వ్యూహాలను శాసిస్తున్న ప్రధాన అంశం. ఏ కులానికి ఎన్ని ఓట్లు? ఏ నియోజకవర్గంలో ఎవరి ప్రభావం? ఎవరికి టికెట్ ఇస్తే ఏ వర్గం మద్దతు లభిస్తుంది? అనే లెక్కల చుట్టూనే రాజకీయ పార్టీల వ్యూహాలు తిరుగుతున్నాయి. ప్రజల ఆకాంక్షలు, నిరుద్యోగుల(unemployed) ఆవేదన, రైతుల(Farmers) సమస్యలు, ధరల భారం, విద్య, వైద్య రంగాల పరిస్థితి కంటే కులాల గణాంకాలకే అధిక ప్రాధాన్యం లభిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ మిగులుతుంది? కుల సమీకరణాలను అర్థం చేసుకోవడం రాజకీయ వాస్తవికత కావచ్చు. కానీ, కులాల పేరుతో ఓటర్లను శాశ్వత ఓటు బ్యాంకులుగా చూడటం మాత్రం ప్రమాదకర ధోరణి. ప్రజలు కుల గుర్తింపుతో పాటు తమ బతుకులు మారాలనే ఆకాంక్షతోనూ ఓటు వేస్తారు. ఈ సత్యాన్ని విస్మరించే పార్టీలు ఎన్నికల వేళ చేసే హడావుడి కంటే ప్రజల తీర్పు చాలా కఠినంగా ఉండొచ్చు.

బ్రాహ్మణ ఓట్ల్లు బీజేపీకి పరీక్ష

2027 ఎన్నికల్లో బ్రాహ్మణ ఓటర్ల మద్దతు కీలకమవుతుందనే అంచనాలు రాజకీయ చర్చలకు కేంద్రంగా మారుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణ వర్గం రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతోందనే భావన ఉందన్న విశ్లేషణలు బీజేపీకి హెచ్చరిక గంటలుగా భావించవచ్చు. ఈ వర్గం మద్దతును నిలబెట్టుకోవడం, ఇతర సామాజిక వర్గాల ఆకాంక్షలకు సమాధానం ఇవ్వడం అధికార పార్టీ ముందున్న సవాళ్లు. అయితే, బ్రాహ్మణ ఓట్లే ఎన్నికల గెలుపును నిర్ణయిస్తాయని ముందుగానే తీర్పు చెప్పడం రాజకీయ తొందరపాటు.ఏ వర్గమైనా ఒకే రాజకీయ పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉండదు. తమ సమస్యలకు పరిష్కారం చూపినవారినే ప్రజలు ఆదరిస్తారు. కుల ప్రాతిపదికన మద్దతు ఉందనే భ్రమలో మునిగితే రాజకీయ పునాదులే కదిలిపోవచ్చు.

అధికారానికి మూడంచెల ముప్పు

కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు, స్థానిక ప్రజాప్రతినిధుల వ్యవహారశైలిపై ఆగ్రహం.. ఈ మూడు అంశాలు కలిస్తే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. పాలనలో విజయాలను ప్రచారం చేసుకోవడం ఎంత ముఖ్యమో, ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తిని గుర్తించి సరిదిద్దుకోవడం అంతకంటే ముఖ్యం. 2022 ఎన్నికల్లో బీజేపీ 255 స్థానాలు సాధించి ఆధిపత్యాన్ని చాటుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ గత విజయమే భవిష్యత్తు విజయానికి హామీ కాదు. ఎన్నికల గణాంకాలను కవచంగా ధరించి ప్రజల ఆగ్రహాన్ని తక్కువ అంచనా వేస్తే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

ప్రతిపక్షాలకు ఐక్యతే అగ్నిపరీక్ష

బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు కేవలం విమర్శలతో సరిపెట్టుకోలేవు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తమ తమ రాజకీయ బలాలను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఓట్ల చీలికను నివారించడం, ప్రజా సమస్యలపై ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, విశ్వసనీయ నాయకత్వాన్ని ముందుకు తేవడం కీలకం. ప్రతిపక్షాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగితే లాభపడేది అధికారపక్షమే. ఒకరి ఓటు బ్యాంకుపై మరొకరు కన్నేయడం, పరస్పర విమర్శలతో కాలం గడపడం వల్ల ప్రజలకు ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రభుత్వం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ప్రత్యామ్నాయ పాలనా ప్రణాళిక లేకుండా అధికార వ్యతిరేకత ఒక్కటే విజయాన్ని అందించదు.

‘సర్’.. పారదర్శకతే పరిష్కారం

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై తలెత్తే వివాదాలు ఎన్నికల విశ్వసనీయతకు సంబంధించిన కీలక అంశం. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండటం, అనర్హమైన నమోదు తొలగించడం, అభ్యంతరాల పరిష్కా రంలో పారదర్శకత పాటించడం ఎన్నికల వ్యవస్థ బాధ్యత. ఓటు హక్కు విషయంలో అనుమానాలకు తావులేని విధంగా ప్రక్రియ సాగాలి. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కంటే, లోపాలు ఉంటే వాటిని ఆధారాలతో బయటపెట్టి సరిదిద్దాలని పట్టుబట్టడం అవసరం. ఓటరు జాబితాపై ప్రజల విశ్వాసం దెబ్బతింటే నష్టం ఏ ఒక్క పార్టీకి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థకే.

నమ్మకమే అసలైన పెట్టుబడి

ఎన్నికల వేళ నగదు, తాయిలాలు, హామీలతో ఓటర్లను ఆకర్షించవచ్చనే ఆలోచన రాజకీయాల్లో పాతదే. కానీ తాత్కాలిక ప్రలోభాలతో ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురాలేరు. యువతకు ఉపాధి, రైతులకు గిట్టుబాటు, మహిళలకు భద్రత, పేదలకు నాణ్యమైన విద్యా-వైద్య సేవలు అందించడం ద్వారానే రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోగలవు. ఎన్నికల మేనిఫెస్టోలు కాగితాలకే పరిమితమైతే, హామీలు ప్రచార వేదికలపైనే మిగిలిపోతే ప్రజలు వాటిని ప్రశ్నించాల్సిందే. అభ్యర్థి కులం ఏమిటన్నదానికంటే అతని పనితీరు ఏమిటి? పార్టీ నినాదాలకంటే పాలనా ఫలితాలేమిటి? అనే ప్రశ్నలు ఓటర్లలో బలంగా వినిపించాలి.

ప్రజల తీర్పే అంతిమం 

ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరగనున్న ఎన్నికలు కుల సమీకరణాలు, అధికార వ్యూహాలు, ప్రతిపక్షాల ఐక్యత, పాలనా పనితీరు మధ్య కీలక పోరుగా మారే అవకాశం ఉంది. కానీ,ఈ పోరులో అసలు యజమానులు రాజకీయ నాయకులు కాదు.. ఓటర్లు. వారి సమస్యలను పట్టించుకోని పార్టీలు, కులాల పేరుతో ప్రజలను విభజించే నాయకులు, హామీలతో కాలక్షేపం చేసే పాలకులు ప్రజల తీర్పును తేలికగా తీసుకోకూడదు. కులం ఎన్నికల లెక్కల్లో భాగం కావచ్చు.. కానీ ప్రజల భవిష్యత్తుకు అది ఒక్కటే కొలమానం కాకూడదు. నగదు ఓటును కొనుగోలు చేయవచ్చనే భ్రమ ఉండవచ్చు. కానీ, ప్రజల విశ్వాసాన్ని కొనలేరు. అధికార బలం ఎన్నికల ప్రచారాన్ని నడిపించవచ్చు. కానీ ప్రజల ఆగ్రహాన్ని శాశ్వతంగా అణచలేరు. ఎన్నికల్లో చివరికి నిలిచేది కులాల లెక్కలు కాదు, ప్రజల నమ్మకాన్ని సంపాదించిన రాజకీయ శక్తులే కావాలి!. 

 వ్యాసకర్త:  సీనియర్ జర్నలిస్టు (సామాజిక, రాజకీయాల 

విశ్లేషకులు 9848559863)

మరిన్ని వార్తలు