భద్రకాళి దేవస్థానానికి నూతన పాలక మండలి సభ్యులు

16-10-2026 | 12:11am

హనుమకొండ,(విజయక్రాంతి): శ్రీ భద్రకాళి దేవస్థాన(Sri Bhadrakali Devasthanam) నూతన పాలక మండలి ఏర్పాటు చేశారు. గురువారం నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy), నీలిమ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

తదనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం(Swearing-in ceremony)లో పాల్గొన్నారు. ఆలయ ఈవో సునీత ఆధ్వర్యంలో నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, భద్రకాళి అమ్మవారి ఆలయానికి రోజురోజుకూ భక్తుల రాక పెరుగుతోందని, నిత్యం సుమారు 5 వేల నుంచి 10 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో నూతన పాలక మండలి సభ్యులు(Members of new governing body) భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అమ్మవారి ఆలయ పవిత్రత, ప్రతిష్టకు భంగం కలగకుండా సమష్టిగా పనిచేయాలని సూచించారు. భక్తుల సేవలో నిబద్ధతతో పనిచేస్తూ ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు.గతంలో పాలక మండలి సభ్యులుగా పనిచేసిన వారు అమ్మవారి సేవలో అంకితభావంతో వ్యవహరిస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు.

అదే స్ఫూర్తితో నూతన పాలక మండలి సభ్యులు కూడా మరింత చురుగ్గా పనిచేస్తూ భద్రకాళి అమ్మవారి ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారి మాడవీధుల అభివృద్ధి జరగడం తనకు ఎంతో సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

అమ్మవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా మాడవీధులను అభివృద్ధి చేయడంతో పాటు, అమ్మవారి రథాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ అవసరమైన నిబంధనలు, పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టినట్లు వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, రద్దీ సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయడం అత్యంత ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక మండలి సభ్యులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు